టీటీడీ కల్తీ నెయ్యి కేసులో రూ.132.55 కోట్ల ఆస్తులు అటాచ్

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో  రూ.132.55 కోట్ల ఆస్తులు అటాచ్
  •     రూ.234.5 కోట్ల విలువైన కల్తీ నెయ్యి సరఫరా చేసిన భోలే బాబా డెయిరీ
  •     కీలక విషయాలు బయటపెట్టిన ఈడీ

హైదరాబాద్, వెలుగు: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఈడీ కీలక విషయాలు బయటపెట్టింది. దేవస్థానానికి కల్తీ నెయ్యిని సరఫరా చేసిన  భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలతో పాటు వాటి ప్రమోటర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, సుకృతి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ సంస్థ ప్రమోటర్ కైలాష్ చంద్ మంగ్లాతో పాటు వారి కుటుంబ సభ్యులు, అనుబంధ సంస్థలకు చెందిన ఆస్తులను అటాచ్ చేసింది. మొత్తం రూ.132.55 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను తాత్కాలికంగా జప్తు చేసినట్లు బుధవారం  ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం ప్రకటించింది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌‌లో నమోదైన ఎఫ్‌‌ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. గత జూన్ 3న ఉత్తరాఖండ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. 

భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ, శ్రీ వైష్ణవి డెయిరీలు టీటీడీకి ఏకంగా రూ.234.5 కోట్ల విలువైన కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్లు  తేల్చింది. దీనివల్ల టీటీడీకి నష్టం కలగడంతో పాటు ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడి, అక్రమంగా భారీ మొత్తంలో లాభాలు ఆర్జించినట్లు పేర్కొంది. ఈ నెయ్యి తయారీలో రిఫైన్డ్ పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామోలిన్, మోనోగ్లిజరైడ్స్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్, లాక్టిక్ యాసిడ్,  బీటా కెరోటిన్ పదార్థాలను ఉపయోగించి కల్తీ చేసినట్లు గుర్తించింది.  నకిలీ బిల్లులు సృష్టించి, బ్యాంకుల ద్వారా వచ్చిన నిధులను హవాలా మార్గాల ద్వారా దారిమళ్లించారు. మొత్తం రూ.132.55 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది. ప్రధాన నిందితులైన విపిన్ జైన్, కైలాష్ చంద్ మంగ్లాలను కూడా ఈడీ అరెస్టు చేసినట్లు వెల్లడించింది.