ప్లాట్ల పేరుతో సాయి సూర్య డెవలపర్స్ మోసం

ప్లాట్ల పేరుతో సాయి సూర్య డెవలపర్స్ మోసం
  •     రూ.14  కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

హైదరాబాద్, వెలుగు: రియల్ ఎస్టేట్ వెంచర్లలో ప్లాట్ల పేరుతో సామాన్యులను మోసం చేసిన కేసులో 'సాయి సూర్య డెవలపర్స్' సంస్థపై ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝుళిపించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈ సంస్థకు చెందిన రూ. 14.63 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేసినట్లు ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. 

పలు రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ ప్రాజెక్టుల్లో ప్లాట్లు అమ్ముతామని చెప్పి ప్రజల నుంచి డబ్బులు సేకరించి, ఆ భూములను వారి పేర్లకు రిజిస్ట్రేషన్‌‌‌‌ చేయకుండా మోసం చేసిన ఆరోపణలపై  సాయి సూర్య డెవలపర్స్ యజమాని సతీశ్ చంద్ర గుప్తా,  ఇతరులపై రాష్ట్ర పోలీసులు ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌లు నమోదు చేశారు. దాని ఆధారంగా ఈడీ అధికారులు మనీలాండరింగ్‌‌‌‌ కోణంలో దర్యాప్తు చేపట్టారు. సతీశ్ చంద్ర గుప్తా అనుమతులు లేని లేఅవుట్లను అభివృద్ధి చేయడం, ఒకే ప్లాట్‌‌‌‌ను పలువురికి విక్రయించడం వంటి అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు ఛార్జిషీట్‌‌‌‌లో పేర్కొన్నారు.

దీనిపై ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాధితుల నుంచి వసూలు చేసిన రూ. 14.63 కోట్లను సతీశ్ చంద్ర గుప్తా తన కుటుంబ సభ్యులు, తన భాగస్వామ్య సంస్థల పేరిట ఉన్న వివిధ బ్యాంకు ఖాతాలకు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. సతీశ్ ఒక పథకం ప్రకారమే ఈ మోసానికి పాల్పడినట్లు తేలింది. ప్రస్తుతం రూ. 14.63 కోట్ల ఆస్తుల జప్తుతో పాటు మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు, జప్తులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.