ఆమ్వే కేసులో చార్జ్​షీట్.. రూ.757 కోట్ల ఆస్తులు జప్తు చేసినట్లు ఈడీ వెల్లడి

ఆమ్వే కేసులో చార్జ్​షీట్.. రూ.757 కోట్ల ఆస్తులు జప్తు చేసినట్లు ఈడీ వెల్లడి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మల్టీ లెవల్‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌ కేసులో ఆమ్వే ఇండియా ఎంటర్‌‌‌‌ ప్రైజెస్‌‌‌‌ ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌పై ఈడీ సోమవారం ప్రాసిక్యూషన్‌‌‌‌ కంప్లైట్‌‌‌‌(చార్జ్​షీట్) దాఖలు చేసింది. ప్రత్యేక కోర్టులో చార్జ్​షీట్ సమర్పించింది. చార్జ్​షీట్​ను కోర్టు విచారణకు స్వీకరించిందని ఈడీ అధికారులు తెలిపారు. ఆమ్వే సంస్థ తమ ఉత్పత్తుల మార్కెటింగ్‌‌‌‌ పేరిట మనీ సర్క్యూలేషన్‌‌‌‌ స్కీమ్​ను ప్రారంభించిందని వివరించారు. 

దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదులు అందాయన్నారు. వేల కోట్ల మనీలాండరింగ్‌‌‌‌ జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు. దీంతో 2011లో మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని వివరించారు. ఎక్కువ లాభాలు ఇస్తామని మల్టీ లెవల్ మార్కెటింగ్‌‌‌‌ ద్వారా రూ.4,050.21 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించామని,  వీటికి సంబంధించిన ఆధారాలను ప్రాసిక్యూషన్‌‌‌‌ కంప్లైట్‌‌‌‌లో పేర్కొన్నట్లు చెప్పారు.

 డిపాజిట్ హోల్డర్స్‌‌‌‌ నుంచి సేకరించిన రూ.2,859 కోట్ల డివిడెంట్లు, రాయల్టీ, ఇతర ఖర్చుల పేరిట వివిధ బ్యాంకు ఖాతాల్లోకి అక్రమంగా మళ్లించినట్టు దర్యాప్తులో గుర్తించామన్నారు. ఇప్పటికే రూ.757.77 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు జప్తు చేసినట్టు వెల్లడించారు.