ముగ్గురు గ్రేటర్ మంత్రులతో చీకోటికి ఆర్థిక లావాదేవీలు 

ముగ్గురు గ్రేటర్ మంత్రులతో చీకోటికి ఆర్థిక లావాదేవీలు 
  • 18 మంది లీడర్లు, 280 మంది రెగ్యులర్ కస్టమర్లు 
  • ముగ్గురు గ్రేటర్ మంత్రులతో చీకోటికి ఆర్థిక లావాదేవీలు 
  • బిజినెస్ లో పెట్టుబడులు పెట్టిన రెండు రాష్ట్రాల నేతలు 
  • బంగారం వ్యాపారులకు హవాలా ఏజెంట్ గా చీకోటి! 
  • సోమవారం విచారణకు రావాలని ఈడీ నోటీసులు 

హైదరాబాద్‌‌, వెలుగు : క్యాసినో దందాలో పెద్దలు ఉన్నట్లు తెలిసింది. సోదాల టైమ్లో చీకోటి ప్రవీణ్ కుమార్ ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. అందులో ప్రముఖుల వివరాలు ఉన్నట్లు గుర్తించింది. ప్రవీణ్ కుమార్ గోవా, హాంకాంగ్‌‌, ఇండోనేషియా, శ్రీలంక, నేపాల్‌‌ లో ప్లేయింగ్‌‌ కార్డ్స్‌‌, క్యాసినో క్లబ్‌‌లు నిర్వహిస్తున్నట్లు ఆధారాలు సేకరించింది. పంటర్స్‌‌, ఏజెంట్లు, బుకీల వివరాలు తెలుసుకుంది. చెన్నై, బెంగళూర్‌‌‌‌, హైదరాబాద్‌‌కు చెందిన బంగారం వ్యాపారులకు ప్రవీణ్ హవాలా ఏజెంట్‌‌గా వ్యవహరిస్తున్నాడని..ఇందులో భాగంగనే గోవా, నేపాల్‌‌ బార్డర్లో నిర్వహిస్తున్న క్యాసినోలో డబ్బులు చేతులు మారుతున్నాయని సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ముగ్గురు మంత్రులతో ప్రవీణ్ కు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని.. ఈ బిజినెస్ లో తెలంగాణ, ఏపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టారని ఈడీ గుర్తించినట్లు తెలిసింది. ఈ దందాలో 18 మంది ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు, 280 మంది రెగ్యులర్ కస్టమర్లు ఉన్నట్లు సమాచారం. కాగా, క్యాసినోలో హవాలా వ్యాపారం చేస్తున్నారనే సమాచారంతో ప్రవీణ్ కుమార్, మాధవరెడ్డి ఇండ్లు, ఆఫీసులల్లో ఈడీ సోదాలు చేసింది. ఫోన్, ల్యాప్ టాప్, పాస్ పోర్టు స్వాధీనం చేసుకుంది. సోమవారం విచారణకు హాజరు కావాలని ప్రవీణ్ కు నోటీసులు ఇచ్చింది. 

ఫ్లైట్లు, హోటళ్లకు 90 లక్షలు  
ప్రవీణ్ గోవా, నేపాల్‌‌లో లీగల్‌‌గానే క్యాసినో బిజినెస్‌‌ చేస్తున్నట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. ఈవెంట్స్‌‌ కోసం 13 మంది బాలీవుడ్‌‌, టాలీవుడ్‌‌ సెలబ్రెటీలతో ప్రమోషన్‌‌ వీడియోలు చేసినట్లు గుర్తించింది. జూన్‌‌ 10 నుంచి 13 వరకు నిర్వహించిన క్యాసినోలో పాల్గొన్నోళ్ల వివరాలు సేకరిస్తోంది. టూర్ ప్యాకేజీల కింద రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేసినట్లు.. టూర్లకు వచ్చినోళ్ల కోసం రూ.50 లక్షలతో ఫ్లైట్స్, రూ.40 లక్షలతో హోటళ్లు బుక్ చేసినట్లు గుర్తించింది.

నాకేం సంబంధం లేదు.. 
కారు స్టిక్కర్‌‌‌‌ టైమ్‌‌ మార్చితో ముగిసింది. ఎక్కడో పడేశాను. దాన్ని వాడేవడో పెట్టుకోవచ్చు. నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో నేను ఇంకేమీ మాట్లాడను. 
- మంత్రి మల్లారెడ్డి 

లీగల్​గానే చేస్తున్న... 
నాకు గోవా, నేపాల్‌‌లో క్యాసినో ఉంది. లీగల్‌‌గానే వ్యాపారం చేస్తున్నాను. అన్ని పర్మిషన్లు ఉన్నాయి. ఈడీ అధికారులు ఎందుకు సోదాలు చేశారో తెలియదు. సోమవారం విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరవుతాను. 
- చీకోటి ప్రవీణ్‌‌ కుమార్‌‌‌‌, క్యాసినో ఆర్గనైజర్‌