- అధిక లాభాలు ఇస్తామంటూ రూ.158 కోట్లు వసూలు
- రంగారెడ్డి జిల్లా కోర్టులో ఈడీ చార్జ్ షీట్ దాఖలు
హైదరాబాద్, వెలుగు: అధిక లాభాలు ఆశచూపి వెయ్యి మంది వినియోగదారుల నుంచి రూ.158 కోట్లు వసూలు చేసిన సన్ పరివార్ వుపాడి మేనేజ్మెంట్ ప్రై.లిమిటెడ్ సంస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చర్యలు ప్రారంభించారు. కేసు దర్యాప్తులో భాగంగా రంగారెడ్డి పీఎంఎల్‌ఏ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రాసిక్యూషన్ కంప్లైంట్(చార్జ్షీట్) దాఖలు చేశారు. ఈ మేరకు ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈడీ వెల్లడించిన వివరాల మేరకు.. మెతుకు రవీందర్ అతడి సన్నిహిత సహచరులు కొందరితో కలిసి సన్ పరివార్ వుపాడి మేనేజ్మెంట్ గ్రూప్ కంపెనీల పేరుతో మెతుకు చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్, మెతుకు వెంచర్స్ లిమిటెడ్ , మెట్సన్ నిధి లిమిటెడ్, మెతుకు హెర్బల్ లిమిటెడ్ , మెతుకు మెడికల్ అండ్ హెర్బల్ ఫౌండేషన్ పేరిట కంపెనీలు స్థాపించారు.
వీటిలో పెట్టుబడి పెడితే ఏడాదిలోనే వందశాతం లాభాలు వస్తాయని ప్రకటనలు ఇస్తూ పదివేల మంది వినియోగదారుల నుంచి రూ.158 కోట్లు వసూలు చేశారు. ఈ డబ్బులు అంతా అక్రమంగా మళ్లించి పలు స్థిర, చరాస్థులు కొనుగోలు చేశారు. అంతేకాకుండా, తన సన్నిహిత సహచరుల పేర్ల మీద కొత్తగా పుడమి అగ్రో ఫార్మ్ ల్యాండ్స్, పుడమి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ (ఇండియా) లిమిటెడ్, డివైన్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ కంపెనీలను స్థాపించి మళ్లీ పొన్జీ పథకాలు ప్రారంభించారు.
ఇలా డబ్బువసూళ్లకు పాల్పడ్డారు. ఈ కొత్త సంస్థల పేరుతో కూడా అధిక రాబడి ఆఫర్‌లతో డబ్బు సేకరించి, ఆ డబ్బుతో స్థిరాస్తులు కొనుగోలు చేశారు. ఈ మోసాలపై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన పలు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ అధికారులు మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు ఇప్పటికే మెతుకు రవీందర్, అతని కుటుంబ సభ్యులు, సన్నిహిత సహచరుల పేర్లపై ఉన్న రూ.25.20 కోట్ల విలువైన వివిధ స్థిర, చరాస్తులను అటాచ్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
