నేను ప్రమోట్ చేసింది గేమింగ్ యాప్ బెట్టింగ్ యాప్ కాదు: ఈడీ విచారణలో విజయ్ దేవరకొండ

నేను ప్రమోట్ చేసింది గేమింగ్ యాప్ బెట్టింగ్ యాప్ కాదు: ఈడీ విచారణలో  విజయ్ దేవరకొండ

హైదరాబాద్: బెట్టింగ్ యాప్ కేసులో టాలీవుడ్ సినీ నటుడు విజయ్ దేవర కొండ ఈడీ ముందు బుధవారం విచారణకు హాజరయ్యాడు. విచారణ అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్ కేసులో తన పేరు రావడంతో విచారణకు పిలిచారని  చెప్పాడు. దేశంలో బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ అని రెండు రకాలు ఉన్నాయని, తాను ప్రమోట్ చేసింది A23 అనే గేమింగ్ యాప్ అని ఈడీకి క్లారిటీ ఇచ్చానని తెలిపాడు. బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్కి సంబంధం లేదని చెప్పాడు. గేమింగ్ యాప్స్ అనేది దేశంలో చాలా రాష్ట్రాల్లో లీగల్ అని, గేమింగ్ యాప్స్కి GST , ట్యాక్స్, అనుమతులు, రిజిస్ట్రేషన్ ఉంటాయని వివరించాడు.

దేశంలో గేమింగ్ యాప్స్ IPL , కబడ్డీ, వాలీ బాల్కి స్పాన్సర్ చేస్తున్నారని తెలిపాడు. తన బ్యాంక్ లావాదేవీలు అన్నీ కూడా ఈడీకి సమర్పించానని, తాను ప్రమోట్ చేసిన A23 యాప్ అనేది తెలంగాణలో ఓపెన్ అవ్వదని చెప్పాడు. లీగల్గా ఉన్న గేమింగ్ యాప్స్ను మాత్రమే ప్రమోట్ చేశానని, తాను చేసుకున్న కాంట్రాక్ట్, లీగల్ అగ్రిమెంట్స్, తీసుకున్న అమౌంట్ వాటి వివరాలు అన్నీ ఈడీకి ఇచ్చానని విజయ్ దేవరకొండ మీడియాకు తెలిపాడు.

ఏపీ, తెలంగాణలో జంగ్లీ రమ్మీ, ఏ23, జీత్‌‌‌‌విన్, పరిమ్యాచ్, లోటస్ 365 సహా ఇతర ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లను 29 మంది సెలబ్రిటీలు ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. నటులు రానా దగ్గుబాటి, ప్రకాశ్‌‌‌‌రాజ్‌‌‌‌, విజయ్‌‌‌‌ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర్‌‌‌‌రాజన్‌‌‌‌, శోభాశెట్టి, అమృత చౌదరి, నాయాని పావని, నేహ పఠాన్‌‌‌‌, పండు, పద్మావతి, ఇమ్రాన్‌‌‌‌ఖాన్‌‌‌‌, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యా సన్నీ యాదవ్‌‌‌‌, శ్యామల, టేస్టీ తేజ, రీతూచౌదరి, బండారు శేషయాని సుప్రీత, మేనేజ్‌‌‌‌మెంట్ ఆఫ్‌‌బెట్టింగ్‌ యాప్స్‌ కిరణ్‌‌‌‌గౌడ్‌‌‌‌, సోషల్‌‌‌‌ మీడియా ఇన్‌‌‌‌ఫ్లూయెన్సర్లు అజయ్‌‌, సన్నీ, సుధీర్‌‌‌‌, యూట్యూబర్‌‌‌‌ లోకల్‌‌‌ బాయ్‌‌‌‌ నాని.. బెట్టింగ్‌‌‌‌ యాప్స్‌‌ను ప్రమోట్‌‌‌‌ చేసిన వారిలో ఉన్నారు.

వీరందరికీ  ఆయా యాప్స్ కంపెనీల నుంచి  పెద్ద మొత్తంలో చెల్లింపులు జరిగాయని ఇప్పటికే  పోలీసుల దర్యాప్తులో  తేలింది.  సెలబ్రిటీలు చేసుకున్న అగ్రిమెంట్లు సహా యాప్స్‌‌‌‌ కంపెనీల నుంచి సెలబ్రిటీల అకౌంట్లతో డిపాజిట్‌‌‌‌ అయిన డబ్బుకు సంబంధించిన డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టింది.