ఈడీ ముందుకు ఏపీ మాజీ ఎమ్మెల్యే

ఈడీ ముందుకు ఏపీ మాజీ ఎమ్మెల్యే
  • హైదరాబాద్ లోని ఊర్వశి బార్ ఓనర్ యుగంధర్ ను కూడా.. 

  • మంత్రి తలసాని పీఏ హరీశ్​కు నోటీసులు? 

హైదరాబాద్, వెలుగు: చీకోటి ప్రవీణ్‌‌ క్యాసినో కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో దాదాపు130 మందికి నోటీసులు ఇచ్చింది. ప్రతిరోజు ఇద్దరిని  విచారిస్తోంది. ఇందులో భాగంగా గురువారం ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గురునాథ్‌‌ రెడ్డి, హైదరాబాద్ పంజాగుట్టలోని ఊర్వశి బార్ ఓనర్ యుగంధర్‌‌‌‌ను ప్రశ్నించింది. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు నిర్వహించిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసింది. ప్రధానంగా చీకోటి ప్రవీణ్‌‌ వాట్సాప్‌‌ చాటింగ్స్, కాల్‌‌డేటా, ఈవెంట్స్‌‌ నిర్వహించిన తేదీల ఆధారంగా ప్రశ్నించినట్లు తెలిసింది. ఈవెంట్స్‌‌ సమయంలో బుక్‌‌ చేసిన స్పెషల్‌‌ ఫ్లైట్ల టికెట్లు, టూర్ ప్యాకేజీ వివరాలతో స్టేట్‌‌మెంట్‌‌ రికార్డ్‌‌ చేసినట్లు సమాచారం. మే, జూన్‌‌ నెలల్లో నేపాల్‌‌, గోవాలో జరిగిన ఈవెంట్స్‌‌ గురించి ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. 

నలుగురికి నోటీసులు!  

గోవా, నేపాల్‌‌, థాయ్‌‌లాండ్‌‌, హాంకాంగ్‌‌లో క్యాసినోకు వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిని ఈడీ విచారిస్తోంది. ఇందులో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌‌ పీఏ హరీశ్ కు కూడా నోటీసులు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయమై హరీశ్​ను వివరణ కోరగా ‘‘నో కామెంట్‌‌’’ అంటూ జవాబిచ్చారు. సికింద్రాబాద్‌‌కు చెందిన మరో ముగ్గురికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. శని, సోమవారాల్లో బషీర్‌‌‌‌బాగ్‌‌లోని ఈడీ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించినట్లు సమాచారం. మంత్రి తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్ సోదరులు మహేష్ యాదవ్‌‌, ధర్మేంద్ర యాదవ్ లను ఈడీ బుధవారం ప్రశ్నించింది. సికింద్రాబాద్‌‌లోని ప్రముఖులంతా చీకోటి క్యాసినో నెట్‌‌వర్క్‌‌లో ఉన్నట్లు గుర్తించింది. తమ దగ్గరున్న ఆధారాలతో నోటీసులు ఇచ్చి విచారిస్తోంది.