మహదేవ్ యాప్ స్కామ్లో టాప్ హీరోకు ఈడీ నోటీసులు

మహదేవ్ యాప్ స్కామ్లో టాప్ హీరోకు ఈడీ నోటీసులు

బెట్టింగ్ మహదేవ్ యాప్ దేశంలో కలకలం రేపుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ ను కుదిపేస్తోంది. మహదేవ్ యాప్ కేసులో తాజాగా బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌కి ఈడీ సమన్లు జారీ చేసింది. అక్టోబరు 6వ తేదీన విచారణకు  రావాలని నోటీసుల్లో చెప్పారు. 

యాప్ ముసుగులో హవాలా మార్గంలో సొమ్మును తరలించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గుర్తించింది. రూ.417 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఇంతకుముందే సీజ్‌ చేసింది. ఈ కేసులో బాలీవుడ్‌కు చెందిన పలువురి పేర్లు తాజాగా వెలుగుచూడడం కలకలం రేపుతోంది. మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ నిర్వాహకుల్లో ఒకరి పెళ్లికి వీరు హాజరవ్వడమే దీనికి కారణం. దీంతో వారికి ఈడీ సమన్లు జారీ చేస్తోంది.

సౌరభ్‌ చంద్రఖర్‌, రవి ఉప్పల్‌ దుబాయ్‌ కేంద్రంగా దేశంలో మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ ముసుగులో మనీలాండరింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గతంలోనే ఈడీ గుర్తించింది. ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న కోల్‌కతా, భోపాల్‌, ముంబయి వంటి నగరాల్లో సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్‌కు సంబంధించి కొన్ని ఆధారాలుసేకరించింది.  మొత్తం రూ.417 కోట్ల ఆస్తులను ఈడీ సీజ్‌ చేసింది. బెట్టింగ్‌ యాప్‌ ద్వారా వచ్చే మొత్తాన్ని ఆఫ్‌షోర్‌ ఖాతాలకు తరలించేందుకు హావాలా మార్గాన్ని అనుసరిస్తున్నట్లు ఈడీ వెల్లడించింది. కొత్త యూజర్లను ఆకట్టుకోవడానికి ఈ బెట్టింగ్‌ యాప్‌ పెద్దఎత్తున ప్రకటనల కోసం ఖర్చు చేసినట్లు తెలిపింది.

మహదేవ్‌ బెట్టింగ్ యాప్‌ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్‌ చంద్రకర్‌ పెళ్లి ఈ ఏడాది ఫిబ్రవరిలో యూఏఈలో జరిగింది. ఇందుకోసం రూ.200 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. బాలీవుడ్‌ సెలబ్రిటీలను ఆహ్వానించినట్లు ఈడీ గుర్తించింది. ఈ వివాహ వేడుకకు బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌, సన్నీ లియోనీ, నేహా కక్కర్‌, అతిఫ్‌ అస్లమ్‌, రహత్‌ ఫతేహ్‌ అలీ ఖాన్‌, అలీ అస్గర్‌, విశాల్‌ దద్లానీ వంటి ప్రముఖ నటులు హాజరయ్యారు. వీరి కోసం ఓ ప్రైవేటు జెట్‌ను సైతం ఏర్పాటు చేసినట్లు అప్పట్లో ఇంగ్లీషు మీడియా కోడై కూసింది.

ALSO READ : తుపాకీ పట్టుకుని తిరుగుతున్న ఎమ్మెల్యే.. అడిగితే స్టైల్ అంటున్నాడు

ఈ కార్యక్రమం కోసం ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీకి రూ.112 కోట్లు హావాలా మార్గంలో నిర్వాహకులు చెల్లించినట్లు ఈడీ గుర్తించింది. ఒక్క హోటల్‌ గదుల కోసమే రూ.42 కోట్లు వెచ్చించినట్లు తెలిసింది. మరో నిర్వాహకుడు రవి ఉప్పల్‌ నిర్వహించిన మరో పార్టీకీ బాలీవుడ్‌ సెలబ్రిటీలు హాజరైనట్లు తెలిసింది. ఈ క్రమంలో హవాలా మార్గంలో వచ్చిన సొమ్మును బాలీవుడ్‌ సెలబ్రిటీలకు ఈవెంట్‌ మేజ్‌మెంట్‌ సంస్థలు చెల్లింపులు చేసినట్లు తెలిసింది. దీంతో బాలీవుడ్‌ సెలబ్రిటీలకూ ఈడీ సమన్లు జారీ చేస్తోంది.