- ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో రెయిడ్స్
- రూ.కోట్ల హవాలా దందా జరిగినట్లు గుర్తింపు
- ఎన్‌ఎంసీ తనిఖీ బృందంలోని సభ్యులతో పాటు 36 మందిపై సీబీఐ కేసు
- హైదరాబాద్, వరంగల్‌లో నాలుగు చోట్ల ఈడీ సోదాలు
హైదరాబాద్, వెలుగు: మెడికల్ కాలేజీల అనుమతులకు సంబంధించి లంచాలు, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) కు చెందిన రహస్య సమాచారాన్ని లీక్ చేసిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ప్రారంభించింది. ఎన్ఎంసీకి చెందిన ఇన్‌స్పెక్షన్ టీమ్ మెంబర్లు సహా లంచాలు ఇచ్చి అనుమతులు పొందిన మెడికల్ కాలేజీల్లో గురువారం ఏకకాలంలో సోదాలు జరిపింది.
ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలోని మొత్తం 15 ప్రాంతాల్లో తనిఖీలు చేసింది. వైద్య కళాశాలల అనుమతులు ఇవ్వడంలో లంచాలు ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై జూన్ 30న ఢిల్లీ జోనల్ సీబీఐ కేసు నమోదు చేసింది.
మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చింది. ఇందులో వరంగల్ ఫాదర్ కొలంబో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన జోసఫ్ కొమ్మరెడ్డి, హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన డాక్టర్ ఎ.రాంబాబు, ఏపీలోని అనంతపురానికి చెందిన బి.హరిబాబు, విశాఖపట్నంలోని ఓ మెడికల్ కాలేజీ డైరెక్టర్ వెంకట్, అక్కయ్యపాలెంలోని డాక్టర్ కృష్ణ కిశోర్ నిందితులుగా ఉన్నారు.
సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. బ్రోకర్స్, ఎన్‌ఎంసీ ఎంక్వయిరీ మెంబర్లకు కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఆధారాలు సేకరించింది. ఈ క్రమంలోనే ఏడు మెడికల్ కాలేజీలు సహా నిందితుల ఇండ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది.
మధ్యవర్తులు లంచం లావాదేవీలు జరపడంలో కీలకంగా వ్యవహిరించినట్లు గుర్తించింది. ఈ సోదాల్లో బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఇతర డిజిటల్ ఆధారాలను సేకరించినట్లు తెలిసింది. జాతీయ వైద్య కమిషన్ అధికారులతో సహా పలువురు కేంద్ర ప్రభుత్వ అధికారులకు లంచాలు చెల్లించారని ఇప్పటికే సీబీఐ దర్యాప్తులో వెలుగు చూసింది. వైద్య కళాశాలలో తనిఖీలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని మధ్యవర్తులు, ప్రైవేట్ మెడికల్ కాలేజీల నిర్వాహకులు, వాటితో సంబంధం ఉన్న సిబ్బందికి లీక్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
