కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటున్నడు .. కోర్టుకు తెలిపిన ఈడీ అధికారులు

కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటున్నడు .. కోర్టుకు తెలిపిన ఈడీ అధికారులు
  • బ్లడ్ షుగర్  లెవెల్స్ పెంచుకుంటున్నడు
  • మెడికల్ బెయిల్ కోసం కావాలనే అలా చేస్తున్నడు
  • కోర్టుకు తెలిపిన ఈడీ అధికారులు.. కేజ్రీవాల్ డైట్ వివరాలు కోరిన కోర్టు

న్యూఢిల్లీ:  టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్న ఢిల్లీ సీఎం అర్వింద్  కేజ్రీవాల్  జైల్లో రోజూ కావాలనే మామిడిపండ్లు, స్వీట్లు, ఆలూ పూరీ తింటున్నారని కోర్టుకు ఈడీ అధికారులు వెల్లడించారు. మెడికల్  బెయిల్ పొందడం కోసమే ఆ పదార్థాలు తిని కేజ్రీవాల్  బ్లడ్ షుగర్  లెవెల్స్  పెంచుకుంటున్నారని తెలిపారు. దీంతో కేజ్రీవాల్  తీసుకుంటున్న డైట్ పై రిపోర్టు ఇవ్వాలని తీహార్  జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. కేజ్రీవాల్ కు డాక్టర్లు సూచించిన డైట్  వివరాలు ఇవ్వాలని ఆయన లాయర్ కు కూడా కోర్టు సూచించింది. 

ఇంటి ఆహారం తినడానికి కేజ్రీవాల్ కు అనుమతి ఉన్నా ఆయన కావాలనే షుగర్  కంటెంట్  ఉన్న ఆహారం తీసుకుంటున్నారని ఈడీ అధికారులు కోర్టుకు ఫిర్యాదు చేశారు. ‘‘టైప్ 2 డయాబెటిస్  అని తెలిసినా కేజ్రీవాల్  కొన్ని రోజులుగా మామిడిపండ్లు, అరటిపండ్లు, స్వీట్లు, ఆలూ పూరీ, షుగర్  టీ తీసుకుంటున్నారు. మెడికల్  ఎమర్జెన్సీ కోసమే ఆయన అలా చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తున్నది” అని ఈడీ తరపు అడ్వొకేట్  కోర్టుకు వివరించారు. కేజ్రీవాల్  ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికపుడు పర్యవేక్షించడానికి జైల్లో ఒక డాక్టర్ ను నియమించామని తెలిపారు. కాగా, తదుపరి విచారణ  శుక్రవారానికి వాయిదా పడింది.  

కేజ్రీవాల్ ను చంపేందుకు కుట్ర: ఆతిశీ

జైలులో కేజ్రీవాల్ ను చంపేందుకు కుట్రపన్నారని ఆప్  లీడర్, ఢిల్లీ మంత్రి ఆతిశీ ఆరోపించారు. కేజ్రీవాల్  టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్నారని, ఇన్సులిన్  ఇవ్వాలని ఆయన కోరినా ఈడీ అధికారులు తిరస్కరించారని ఆమె పేర్కొన్నారు. ‘‘ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడుసార్లు కేజ్రీవాల్ ను ఓడించలేకపోయింది. దీంతో ఆయనను జైల్లో పెట్టి చంపాలని కుట్ర జరుగుతోంది” అని ఆరోపించారు. కేజ్రీవాల్  కావాలనే మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారన్న ఈడీ ఆరోపణలను ఆమె ఖండించారు.

 ఈడీ అదుపులో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా!

ఢిల్లీ వక్ఫ్ బోర్డులో అక్రమాలకు సంబంధించిన కేసులో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసినట్లు ఢిల్లీ మంత్రి ఆతిషీ తెలిపారు. ఆప్ పార్టీని అంతం చేసేందుకు బీజేపీ పన్నుతున్న కుట్రల్లో ఇదొకటని ఆమె విమర్శించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణతో అమానతుల్లాను అరెస్టు చేశారని ఆరోపించారు. గురువారం రాత్రి ఆమె ట్వీట్ చేశారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్​తో కలిసి అమానతుల్లా కుటుంబసభ్యులను పరామర్శించానని పేర్కొన్నారు.

సిసోడియా కస్టడీ 26 వరకు పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఏప్రిల్ 26 వరకు కస్టడీని పొడిగిస్తూ స్పెషల్ జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో విధించిన కస్టడీ ముగియడంతో తీహార్ జైలు అధికారులు సిసోడియాను గురువారం కోర్టులో హాజరుపరిచారు. కస్టడీని కొనసాగించాలని కోరగా.. జడ్జి అందుకు అంగీకరించారు. సిసోడియా  బెయిల్ పిటిషన్ పై  ఏప్రిల్ 20న వాదనలు వింటామన్నారు.