దళిత విద్యార్థుల పేరుతో రూ.300 కోట్లు మాయం

దళిత విద్యార్థుల పేరుతో రూ.300 కోట్లు మాయం
  •     ఆపరేషన్‌ మొబిలైజేషన్‌ సంస్థ ఘరానా మోసం
  •     విద్య, భోజన వసతి కల్పిస్తున్నట్టు ప్రచారం
  •     18 దేశాల నుంచి విరాళాల సేకరణ
  •     మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ
  •     శుక్ర, శనివారాల్లో 11 ప్రాంతాల్లో సోదాలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: దళితులు, అణగారినవర్గాలకు సేవ చేస్తున్నామంటూ విదేశాల నుంచి నిధులు సేకరించి.. వాటిని పక్కదారి పట్టించిన ఆపరేషన్‌‌‌‌ మొబిలైజేషన్‌‌‌‌(ఓఎమ్) సంస్థలపై ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌(ఈడీ) కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌‌‌‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 11 ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో ఆకస్మిక తనిఖీలు చేసింది. ఈ సోదాల్లో చారిటీ పేరుతో విదేశాల నుంచి సేకరించిన ఫారిన్ ఫండ్ దారిమళ్లించినట్టు ఆధారాలు సేకరించింది. ఇందుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, డిజిటల్‌‌‌‌ డివైజ్‌‌‌‌లు స్వాధీనం చేసుకుంది. సోదాల వివరాలను ఈడీ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

రూ.300 కోట్లు ఫారిన్ ఫండ్‌‌‌‌ మాయం

ఆపరేషన్‌‌‌‌ మొబిలైజేషన్‌‌‌‌(ఓమ్‌‌‌‌) గ్రూప్ ఆఫ్‌‌‌‌ చారిటీస్‌‌‌‌ పేరుతో గతంలో రాష్ట్ర వ్యాప్తంగా నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ ఏర్పాటు చేశారు. దళితులు, అణగారినవర్గాల స్టూడెంట్లకు 100 స్కూల్స్‌‌‌‌లో ఉచిత విద్య, భోజన వసతి కల్పిస్తున్నామంటూ సంస్థ ప్రతినిధులు ప్రచారం చేసుకున్నారు. అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, డెన్మార్క్‌‌‌‌, జర్మనీ, ఫిన్‌‌‌‌లాండ్, ఐర్లాండ్‌‌‌‌, మలేసియా, నార్వే, బ్రెజిల్‌‌‌‌, చెక్ రిపబ్లిక్‌‌‌‌, ఫ్రాన్స్‌‌‌‌, రుమేనియా, సింగపూర్‌‌‌‌, స్వీడన్‌‌‌‌, స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన దాతల నుంచి దళిత్‌‌‌‌ ఫ్రీడమ్‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ ద్వారా రూ.300 కోట్లకు పైగా నిధులు సేకరించారు. ఈ డబ్బును విద్యార్థులకు ఖర్చు చేయకుండా సొంత కంపెనీలకు  దారి మళ్లించారు.

ఆఫీస్‌‌‌‌ బేరర్స్‌‌‌‌ పేరిట ఆస్తుల కొనుగోలు

ఓఎమ్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ చారిటీస్‌‌‌‌ పేరిట విదేశాల నుంచి సేకరించిన విరాళాలతో సంస్థల్లోని కీలక ఆఫీస్‌‌‌‌ బేరర్స్‌‌‌‌ పేరిట ఆస్తులు కొనుగోలు చేశారు. తెలంగాణ, గోవా, కేరళ, కర్నాటక, మహారాష్ట్రలో స్థిరాస్థులు కొనుగోలు చేసినట్టు ఈడీ గుర్తించింది. ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌సీఏ(ఫారిన్‌‌‌‌ కంట్రిబ్యూషన్‌‌‌‌ రెగ్యులేషన్‌‌‌‌ యాక్ట్‌‌‌‌) రిజిస్ట్రేషన్లు కూడా రెన్యువల్‌‌‌‌ చేయలేదని, ఓఎమ్‌‌‌‌ బుక్స్‌‌‌‌ ఫౌండేషన్‌‌‌‌ పేరిట సేకరించిన ఫారిన్ ఫండ్స్‌‌‌‌ను దారి మళ్లించినట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. ఆఫీస్‌‌‌‌ బేరర్స్‌‌‌‌  గోవాలో పలు షెల్‌‌‌‌ కంపెనీలను సృష్టించి వారంతా ఉద్యోగులుగా చూపి, జీతాల రూపంలోనూ డబ్బు కొళ్లగొట్టినట్టు 
అధికారులు గుర్తించారు. 

సీఐడీ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు 

ఆపరేషన్‌‌‌‌ మొబిలైజేషన్‌‌‌‌ చారిటీ నిధుల దుర్వినియోగంపై 2016 లో తెలంగాణ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. రూ.296 కోట్ల అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. తెలంగాణ సీఐడీ ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్‌‌‌‌ కేసు నమోదు చేసింది. ఓఎమ్‌‌‌‌ సంస్థ  పేరుతో విరాళాలు సేకరించి ఆస్తులను కూడబెట్టడంతో పాటు ఇతర అనధికార పనులకు వాడినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ట్యూషన్‌‌‌‌ ఫీజుల పేరిట నెలకు ఒక్కో విద్యార్థికి రూ.1000 నుంచి రూ.1,500 వరకు విరాళాలు సేకరించినట్టు సీఐడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఈ సొమ్మును 11 సంస్థల పేరుతో ఫిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డిపాజిట్లు, ఇతర ఆస్తుల కొనుగోలుకు వినియోగించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పత్రాలు, అనుమానాస్పద లావాదేవీల వివరాలు, డిజిటల్‌‌‌‌ డివైజ్‌‌‌‌లు స్వాధీనం చేసుకొని, కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు.