- బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ అధికారుల నిర్ణయం
న్యూఢిల్లీ: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప, సినీ నటుడు సోనూ సూద్ ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తాత్కాలికంగా అటాచ్ చేశారు. వీరితో పాటు నటి ఊర్వశి రౌటేలా తల్లి నేహా శర్మ, బెంగాలీ యాక్టర్ అంకుశ్ హజ్రా, మాజీ ఎంపీ మిమి చక్రవర్తి ఆస్తులను కూడా తాత్కాలికంగా అటాచ్ చేశారు. అటాచ్ చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ.7.93 కోట్లు అని అధికారులు తెలిపారు.
1ఎక్స్ బెట్ ప్లాట్ ఫాంను ప్రమోట్ చేశారంటూ వారిపై వివిధ రాష్ట్రాల్లో పోలీసులు కేసు నమోదు చేశారు. యాప్ ప్రమోషన్ లో భాగంగా వచ్చిన ఆదాయాన్ని నిందితులు మనీ లాండరింగ్ చేశారని పేర్కొన్నారు. మనీ లాండరింగ్ కోణంలో ఈ కేసును ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ‘‘1ఎక్స్ బెట్ తో పాటు దాని అనుబంధ సంస్థలు 1ఎక్స్ బ్యాట్, 1ఎక్స్ బ్యాట్ స్పోర్టింగ్ లైన్స్ దేశవ్యాప్తంగా ఇల్లీగల్ ఆన్ లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ను ప్రమోట్ చేస్తున్నాయి.
ఇలాంటి బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడం నేరమని తెలిసి కూడా సెలబ్రిటీలు ఆ యాప్లను ప్రమోట్ చేశారు. దీనికి రిటర్న్స్ గా అక్రమ మార్గాల్లో సెలబ్రిటీలకు కంపెనీలు డబ్బు చెల్లించాయి. ఇండియన్ యూజర్లను బెట్టింగ్ వైపు మళ్లించేందుకు సోషల్ మీడియా, ఆన్ లైన్ వీడియోలు, ప్రింట్ మీడియా ద్వారా తన అనుబంధ సంస్థలను 1 ఎక్స్ ప్రోత్సహించింది. బెట్టింగ్ ద్వారా వచ్చిన డబ్బులను విదేశీ మధ్యవర్తుల సాయంతో చెల్లింపులు చేయించింది” అని ఈడీ అధికారులు వివరించారు.
కాగా.. ఇదే కేసులో ఈ ఏడాది అక్టోబరు 6న మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధవన్ కు చెందిన రూ.11.14 ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది.
