- హైదరాబాద్, జైపూర్, కోయంబత్తుర్‌లో ఏకకాలంలో రైడ్స్
- ఏపీ మైన్స్ మాజీ ఎండీ వీజీ వెంకటరెడ్డి సహా ఆరు కంపెనీల్లో తనిఖీలు చేసిన ఈడీ
- ఇసుక అక్రమ మైనింగ్‌పై 2024 లో ఏపీ ఏసీబీ కేసు నమోదు
- మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు ప్రారంభించిన ఈడీ
హైదరాబాద్, వెలుగు: ఇసుక అక్రమ తవ్వకాల ద్వారా ఏపీ ప్రభుత్వానికి రూ.2,566 కోట్ల నష్టం కలిగించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ప్రారంభించింది. ఈ మేరకు 2024 లో ఏపీ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ‘ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్‌ఫర్మేషన్ రిపోర్ట్’ నమోదు చేసి బుధవారం ఏపీ గనులు, భూగర్భ వనరుల శాఖ మాజీ ఎండీ, ఇన్చార్జిగా పనిచేసిన వీజీ వెంకటరెడ్డి నివాసం సహా హైదరాబాద్ జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్‌లోని ఇసుక మైనింగ్ కంపెనీల కార్యాలయాలు, కోయంబత్తుర్, జైపూర్‌లలోని మరో రెండు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.
ఈ సందర్భంగా కంపెనీల ఆడిట్ రిపోర్టులు, బ్యాంక్ లావాదేవీలు, ఇసుక టెండర్లకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఏపీలోని ఇసుక గనుల నిర్వహణ సమయంలో టెండర్లు, ఒప్పందాలలో వరుస ఉల్లంఘనలకు పాల్పడి, తద్వారా రాష్ట్ర ఖజానాకు భారీ నష్టాన్ని కలిగించినట్లు ఏపీ ఏసీబీ 2024 సెప్టెంబర్ 11న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ప్రధాన నిందితుడిగా వీజీ వెంకటరెడ్డి సహా ఆరు కంపెనీలను ఇందులో చేర్చింది.
ఇసుక తవ్వకాల్లో అక్రమాలు–ఏపీ ఏసీబీ
ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారంలో ఏపీ ఏసీబీ సమగ్ర దర్యాప్తు చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు2021 మే నుంచి 2023 మే వరకు ఇసుక టెండర్ల అగ్రిమెంట్లు, ప్రభుత్వ విధివిధానాలకు సంబంధించిన డాక్యుమెంట్లు సేకరించింది. ఎలాంటి పర్యావరణ అనుమతులు పొందకుండానే, లీజు సరిహద్దులు, భారీ యంత్రాలను ఉపయోగించి అనుమతించిన లోతుకు మించి ఇసుకను తవ్వకాలు జరిపినట్లు గుర్తించింది.
ఇందుకు పలు ప్రైవేట్ ఏజెన్సీలను అనుమతించినట్లు నిర్ధారించింది. ఈ కేసులో నిందితుడైన వీజీ వెంకటరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా తన నియంత్రణలో ఉన్న రూ.120 కోట్ల బ్యాంకు గ్యారంటీలను విడుదల చేయడానికి జేపీవీఎల్, ఇతరులతో కుట్ర పన్నారని ఏసీబీ గుర్తించింది. రాష్ట్ర ఖజానాకు అక్రమ నష్టాన్ని కలిగించడంతో పాటు జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తదితరులకు లాభాన్ని చేకూర్చే విధంగా కుట్రలు చేసినట్లు ఏసీబీ తేల్చింది. ఇందుకు గాను ఏపీ ప్రభుత్వానికి సుమారు రూ.2,566 కోట్లు నష్టం వాటిల్లినట్లు ఏసీబీ తన నివేదికలో వెల్లడించింది.
