వైఎస్‌ వివేకా హత్య కేసులో ఈడీ సోదాలు

వైఎస్‌ వివేకా హత్య కేసులో ఈడీ సోదాలు
  •  ఎంపీ అవినాశ్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షల నగదు స్వాధీనం

హైదరాబాద్, వెలుగు: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి జరిగిన రూ.40 కోట్ల లావాదేవీలపై ఈడీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది. ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి నివాసంతో పాటు నిందితులు శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి, షేక్ దస్తగిరి, సునీల్ యాదవ్, సయ్యద్ మున్నా ఇండ్లలో శుక్రవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లోని కోకాపేట, కడపలోని 5 ప్రాంతాలతో సహా మొత్తం 7 చోట్ల తనిఖీలు చేపట్టారు.

అవినాశ్ రెడ్డి నివాసం నుంచి లెక్కల్లో చూపని రూ.24 లక్షల నగదు, 2 లాకర్ల తాళాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో పలు కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను గుర్తించి సీజ్ చేశారు. 2020 మార్చి నుంచి సీబీఐ ఈ కేసులో 3 చార్జ్‌షీట్లను దాఖలు చేసింది. ఈ కేసులో మరో నిందితుడైన షేక్ దస్తగిరి అప్రూవర్‌‌గా మారాడు. వివేకా హత్య కోసం శివ శంకర్ రెడ్డి రూ.40 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు, సునీల్ యాదవ్ నుంచి రూ.కోటి తీసుకున్నట్లు దస్తగిరి సీబీఐ విచారణలో అంగీకరించాడు.