తెలంగాణ అభివృద్ధికి అడ్డంకులు ఎందుకు?: కేంద్రం తీరుపై మంత్రి పొన్నం విమర్శలు

తెలంగాణ అభివృద్ధికి అడ్డంకులు ఎందుకు?: కేంద్రం తీరుపై మంత్రి పొన్నం విమర్శలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా సహకరించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎందుకు అడ్డంకులు సృష్టిస్తోందని, దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము బీజేపీ నేతలకు లేదా అని ఘాటుగా విమర్శించారు.

వికసిత్ భారత్ లక్ష్యమే ధ్యేయంగా

ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్న వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరాలంటే ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందాలని, అందులో తెలంగాణ కీలక భాగస్వామిగా ఉండాలనే ఉద్దేశంతోనే 'తెలంగాణ రైజింగ్ 2047' లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, దేశాభివృద్ధి విషయంలో కేంద్రంతో కలిసి పనిచేయడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

విదేశీ పర్యటనల అనుమతి నిరాకరణపై ఆగ్రహం

రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ సామర్థ్యాన్ని చాటడం తమ లక్ష్యమని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. అయితే, రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి అమెరికా, లండన్ పర్యటనలు చేపట్టాలనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుమతులు నిరాకరించడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుబడులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి వెళ్లే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. ఇది కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.

కేంద్రాన్ని నిలదీయడంలో బీజేపీ విఫలం

మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్లు, ఇంటర్నల్ రేడియల్ రింగ్ రోడ్లు వంటి కీలక ప్రాజెక్టులతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, మౌలిక వసతుల కల్పనలో కేంద్రం సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. చిన్నచిన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకుండా సమాఖ్య స్ఫూర్తిని చాటాలని హితవు పలికారు. పక్క రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నప్పుడు తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదని, దక్షిణ భారతదేశం నుంచి కేంద్రానికి ఇస్తున్నది ఎంత, తిరిగి వస్తున్నది ఎంత అనే అంశంపై బీజేపీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.