విజయన్‌ ఇంట్లో సోదాలు.. రాజకీయ దాడే : విజయరాఘవన్‌

విజయన్‌ ఇంట్లో సోదాలు.. రాజకీయ దాడే : విజయరాఘవన్‌
  • సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు విజయరాఘవన్‌

హైదరాబాద్, వెలుగు:  కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌ నివాసంలో ఈడీ సోదాలు పక్కా రాజకీయ దాడేనని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు విజయరాఘవన్‌ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని విపక్షాలపై కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఫైర్​అయ్యారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ పొలిట్​బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యురాలు జ్యోతితో కలిసి ఆయన మాట్లాడారు.

సీపీఎం నేతలపై ఆర్థికపరమైన ఆరోపణలు ఒక్కటి కూడా లేవని, ఇతర పార్టీల్లా కార్పొరేట్ల నుంచి ఎలక్టోరల్‌ బాండ్లు తీసుకోలేదని ఎద్దేవా చేశారు. కేరళలో కాంగ్రెస్‌ నేతలపై కేసులున్నా వదిలేసి, కావాలనే సీపీఎంను టార్గెట్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. మోదీ పాలనలో రూపాయి విలువ 12 శాతం పడిపోయిందని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, నిత్యావసరాలు, పెట్రో ధరల భారంతో సామాన్యులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాఘవులు మాట్లాడుతూ.. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే విపక్షాలపై దాడులు పెరిగాయని విమర్శించారు. జాన్‌ వెస్లీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలను ప్రభుత్వం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోవాలని,  ప్రైవేట్‌ దోపిడీని అరికట్టేందుకు ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని డిమాండ్​చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు నిరుద్యోగుల కోసం భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు. ఏపీలో ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌పై నమోదైన అక్రమ కేసులను చంద్రబాబు ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.