- ఇప్పటికే 9,214 టన్నుల తడిసిన ధాన్యాన్ని కొన్నామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రాష్ట్ర సివిల్ సప్లయిస్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతులు ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని కొని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల్లో ఏర్పడిన పరిస్థితులపై మంత్రి అత్యవసర సమీక్ష నిర్వహించారు. సీఎస్ రామకృష్ణారావు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రివర్గ సహచరులు, సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జిల్లా కలెక్టర్లు, పోలీసు, రవాణా శాఖ అధికారులు, సివిల్ సప్లయ్స్శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.
అకాల వర్షాలకు తడిసిన 9,214 టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించినట్లు మంత్రి వెల్లడించారు. రైతులకు నష్టం కలిగించే ఎటువంటి చర్యలనూ ప్రభుత్వం ఉపేక్షించబోదని అన్నారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. యాసంగి సీజన్‌లో రికార్డు స్థాయిలో 75 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.
ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలకు 66.75 లక్షల టన్నుల ధాన్యం చేరగా, అందులో 57 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. రైతులకు ఇప్పటివరకు రూ.10,097 కోట్ల చెల్లింపులు జరిగాయని, దీని ద్వారా 8.15 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరిందని వివరించారు. కొనుగోలు చేసిన 57 లక్షల టన్నుల ధాన్యంలో 44.67 లక్షల టన్నులు దొడ్డు రకాల ధాన్యం కాగా, 12.33 లక్షల టన్నులు సన్న రకాల ధాన్యం అని మంత్రి పేర్కొన్నారు.
ధాన్యాన్ని మిల్లులకు వేగంగా తరలించేందుకు ఇసుక సరఫరా చేసే లారీలను కొనుగోలు కేంద్రాలకు మళ్లించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. అయినప్పటికీ ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం ధాన్యం కొనుగోళ్లపై రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
