
- రూ.277 కోట్ల ఆస్తులు, రూ.22.7 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ జప్తు
- దర్యాప్తు వేగవంతం చేసిన ఈడీ
- మనీలాండరింగ్ వ్యవహారంపై ఫోకస్
హైదరాబాద్, వెలుగు: హీరా గ్రూప్ స్కీముల స్కామ్ లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగవంతం చేసింది. తెలంగాణ, ఏపీ, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలోని హీరాగోల్డ్ కు చెందిన రూ.299.99 కోట్ల ఆస్తులను శుక్రవారం అటాచ్ చేసింది. ఇందులో రూ.277.29 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ.22.70 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్‌ను జప్తు చేసినట్లు తెలిపింది. స్కీముల పేరుతో రూ.వేల కోట్ల డిపాజిట్లు సేకరించి మోసానికి పాల్పడిందనే ఆరోపణలతో హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ నౌహీరా షేక్ ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీసీఎస్ పోలీసులు, ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా మనీ ల్యాండరింగ్ పై ఈడీ ఫోకస్ పెట్టింది.
రూ.5,600 కోట్ల డిపాజిట్లు
హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో దేశవ్యాప్తంగా సుమారు1,72,000 మంది నుంచి దాదాపు రూ.5,600 కోట్ల డిపాజిట్లు సేకరించినట్లు ఈడీ తెలిపింది. తక్కువ పెట్టుబడులకు అధిక లాభాలు చెల్లిస్తామని డిపాజిటర్లను నమ్మించి మోసం చేసినట్లు ఆధారాలు సేకరించింది. హీరా గ్రూప్స్ లో పెట్టుబడులు పెడితే నెలకు 3% (సంవత్సరానికి36%) లాభాలు ఇస్తామని నమ్మించినట్లు చెప్పింది. అనేక స్కీములతో డిపాజిటర్లను ఆకర్షించేందుకు నౌహీరా షేక్ 24 కంపెనీలను ప్రారంభించింది. హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో రిజిస్టరైన 24 కంపెనీల కోసం దేశవ్యాప్తంగా 182 బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేశారు. యుఏఈ, సౌదీ అరేబియా వంటి అరబ్దేశాల్లో మరో 10 బ్యాంక్ అకౌంట్లను నౌహీరా ఓపెన్ చేసినట్లు ఈడీ గుర్తించింది. ఫారెన్ బ్యాంకుల్లో ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, కంపెనీస్, ఆర్బీఐ యాక్ట్, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి కూడా అనుమతులు తీసుకోకుండా డిపాజిట్లను సేకరించినట్లు ఈడీ గుర్తించింది. ఆహారం, గోల్డ్, టెక్స్ టైల్స్ బిజినెస్ పేరుతో మనీ ల్యాండరింగ్ చేసినట్లు తేల్చారు.