కవితపై విచారణ పది రోజులు వాయిదా..సుప్రీంకోర్టుకు తెలిపిన ఈడీ   

కవితపై విచారణ పది రోజులు వాయిదా..సుప్రీంకోర్టుకు తెలిపిన ఈడీ   

న్యూఢిల్లీ/హైదరాబాద్, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణను పది రోజులు వాయిదా వేస్తామని సుప్రీంకోర్టుకు ఈడీ తెలిపింది. ఈ కేసులో ఈ ఏడాది మార్చి 11న కవితను ఢిల్లీ హెడ్ ఆఫీసులో ఈడీ విచారించింది. ఈ నెల 15న విచారణకు హాజరుకావాలని మరోసారి నోటీసులు ఇచ్చింది. అయితే కవిత గతంలోనే ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై శుక్రవారం మళ్లీ వాదనలు జరిగాయి.

కవిత తరఫు లాయర్ వాదిస్తూ.. చట్టం మహిళలకు కొన్ని సడలింపులు ఇచ్చిందని, దానిపై క్లారిటీ వచ్చే వరకు ఈడీ పంపిన సమన్లను నిలుపుదల చేయాలన్నారు. అదనపు సొలిసిటర్ జనరల్ ఏఎస్ జీ రాజు వాదిస్తూ.. ‘కవిత ఇప్పటికే పలుమార్లు విచారణకు హాజరయ్యారు. ఒకవేళ ఆమె బిజీగా ఉంటే మరో పది రోజుల వరకు విచారణను వాయిదా వేస్తాం’ అని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అప్పటి వరకు కవితను విచారణకు పిలవవద్దని ఆదేశించింది. 

ALSO READ: బంజారా జాతీయ కమిషన్ ఏర్పాటు చేయండి 

సోనియా, రాహుల్​పై ఈడీ కేసుల్లో కదలికేది? : కవిత

సోనియా, రాహుల్​గాంధీపై నమోదైన ఈడీ కేసుల్లో ఎందుకు కదలిక లేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. నేషనల్ ​హెరాల్డ్​ కేసులో ఏడాది క్రితం కాంగ్రెస్ అగ్ర నేతలతో పాటు ఏపీ, తెలంగాణకు చెందిన నాయకులను ఈడీ పిలిపించి విచారించిందని ఆమె గుర్తుచేశారు. ప్రస్తుతం ఆ కేసు ఏమైందో చెప్పాలని ఆమె డిమాండ్​ చేశారు.