లిమిట్స్ దాటుతున్నారు.. ఇది రాజ్యాంగ ఉల్లంఘనే: ఈడీపై సుప్రీంకోర్టు సీరియస్

లిమిట్స్ దాటుతున్నారు.. ఇది రాజ్యాంగ ఉల్లంఘనే: ఈడీపై సుప్రీంకోర్టు సీరియస్

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) రైడ్లపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఈడీ లిమిట్స్ దాటి ప్రవర్తిస్తోందని ఘాటా వ్యాఖ్యలు చేసింది.  తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పోరేషన్ (TASMAC) హెడ్ క్వార్టర్ పై ఈడీ రైడ్స్ చేయడం రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుందని మండిపడింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ చర్యలపై స్టే విధించింది. 

లిక్కర్ రవాణా, బార్, రెస్టారెంట్ల నిర్వహణకు సంబంధించిన లైసెన్స్ లు, బాటిల్ తయారీ కంపెనీలతో పాటు డిస్టిల్లరీలతో TASMAC అక్రమ ఒప్పందాలు కుదుర్చుకుని మనీ లాండరింగ్ కు పాల్పడిందని ఈడీ ఆరోపిస్తోంది. అందులో భాగంగా మార్చిలో రైడ్స్ చేయడంతో పాటు గత వారంలో మరోసారి తనిఖీలు నిర్వహించడంపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఫెడరల్ స్ట్రక్చర్ అనే భావనకు విరుద్ధంగా ఈడీ ప్రవర్తిస్తోందని మండిపడింది ఉన్నత న్యాయస్థానం. 

 TASMAC వెయ్యి కోట్ల రూపాయల స్కాంకు పాల్పడిందన్న ఈడీ ఆరోపణలపై ఈడీ విచారణకు మద్రాస్ కోర్టు గతంలో అనుమతించింది. దీనిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును శ్రయించింది.  గురువారం (మే 22)  చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టిన్ జ్యార్జ్ మాసిహ్ లతో కూడిన బెంచ్ తమిళనాడు ప్రభుత్వ పిటిషన్ ను విచారించింది. 

‘‘వ్యక్తులపైన కేసులు పెట్టవచ్చు.. కానీ ఒక కార్పోరేషన్ పై ఎలా కేసులు పెడతారు..? కార్పోరేషన్ పైన క్రిమినల్ కేసులా..? మీ ఈడీ అన్ని లిమిట్స్ ను దాటుతోంది’’ అని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి విచారణపై స్టే విధించింది. 

సుప్రీంకోర్టు తీర్పును డీఎంకే స్వాగతించింది. ఈడీని అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలపై కక్ష్యసాధించాలనుకునే బీజేపీ ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు అని రాజ్యసభ ఎంపీ, డీఎంకే నేత ఆర్.ఎస్.భారతి అన్నారు.