
Anil Ambani: అనిల్ అంబానీ పాతాళం నుంచి తిరిగి వెలుతురును చూస్తున్న దివాలా తీసిన వ్యాపారవేత్త. గడచిన కొన్ని త్రైమాసికాలుగా ఆయన సంస్థలు నష్టాల ఊబి నుంచి తిరిగి పుంజుకుంటున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వ సంస్థలు ఆయన కేసుపై పట్టు బిగించటం మెుదలుపెట్టాయి. ఇది యాద్రుచికంగా జరుగుతోందే లేక తెరవెనుక ఏమైనా జరుగుతోందో తెలియదు కానీ ఈడీ మాత్రం గడచిన కొన్ని రోజులుగా ఆయన కేసులపై దూకుడు పెంచేసింది.
గతవారం అనిల్ అంబానీకి చెందిన సంస్థలు మాజీ ఉద్యోగులపై ఈడీ సోదాలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీని తర్వాత ప్రస్తుతం అనిల్ అంబానీకి సమస్యలు మరింత తీవ్రతరం అవుతున్నాయి. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కంపెనీల వేలాది కోట్ల రుణ మోసాల ఆరోపణలకు సంబంధించిన మనీలాండరింగ్ ప్రశ్నించేందుకు ఆగస్టు 5న అనిల్ తమ ముందు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇదే క్రమంలో ఆయన సంస్థలు రుణాలు పొందిన డజనుకు పైగా బ్యాంకులకు లోన్ వివరాలు కోరుతూ లేఖలు రాసింది ఈడీ.
దీంతో ఈడీ ప్రస్తుతం రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ సంస్థ రుణ వివరాలను కోరుతూ ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులకు లేఖలు పంపింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఎస్బీఐ, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యూకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్ లేఖలు అందుకున్న లిస్టులో ఉన్నాయని తేలింది. రానున్న కాలంలో రుణాలను మంజూరు చేసిన బ్యాంక్ అధికారులు, సిబ్బందికి కూడా ఈడీ నోటీసులు అందే అవకాశం ఉందని తెలుస్తోంది. రుణ ఆమోద ప్రక్రియ నుంచి లోన్స్ డిఫాల్ట్ వరకు సమాచారాన్ని వారి నుంచి సేకరించాలని ఈడీ చూస్తోంది. అలాగే రికవరీకి ప్రక్రియ గురించి కూడా ఈడీ సమాచారం కోరింది.
►ALSO READ | E20 పెట్రోల్ వాడుతున్నారా..? ఐతే మీ కారు బైక్ ఇంజన్ ఖతం.. జేబులకు చిల్లు..!!
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కంపెనీలపై జరిగిన రూ.3వేల కోట్ల రుణ మోసం కేసులో ఏజెన్సీ గత వారం మొదటి అరెస్టు చేసింది. బిస్వాల్ ట్రేడ్‌లింక్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పార్థ సారథి బిస్వాల్‌ను శుక్రవారం రూ.68.2 కోట్ల నకిలీ హామీని సమర్పించినందుకు మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 కింద అరెస్టు చేశారు. ఈ హామీని రిలయన్స్ పవర్ ఇచ్చిందని అతను చెప్పారు. అలాగే రుణం మంజూరుకు మునుపే బ్యాంక్ ప్రమోటర్లకు ముడుపులు అందినట్లు ఈడీ గుర్తించింది. గత నెలలో ఈ కేసుకు సంబంధించిన 50 కి పైగా సంస్థలపై ఏజెన్సీ దాడులు చేసింది. అంబానీపై లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే.