ఈడీ ఛార్జిషీట్ కల్పితం : కేజ్రీవాల్

ఈడీ ఛార్జిషీట్ కల్పితం : కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ స్కాం ఛార్జ్ షీటులో ఈడీ తన పేరు చేర్చడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈడీ ఛార్జిషీట్ కల్పితమని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఈడీ పనిచేయడం లేదన్న ఆయన.. అధికారంలో ఉన్న పార్టీ కోసం ఎమ్మెల్యేలను కొనేందుకు, ప్రభుత్వాలను కూల్చేందుకు పనిచేస్తోందని ఆరోపించారు. మోడీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఈడీ 5000 ఛార్జిషీట్లు దాఖలు చేసిందని ఇందులో ఎంతమందికి  శిక్ష పడిందో చెప్పాలని డిమాండ్ చేశారు. 

మరోవైపు  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌లో ఈడీ దాఖలు చేసిన రెండో ఛార్జ్‌షీటులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంటతో సహా 17 మంది పేర్లున్నాయి. లిక్కర్ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత 10 సెల్ ఫోన్లు మార్చినట్లు ఈడీ ఛార్జ్ షీటులో ఆరోపించింది. సాక్ష్యాలు ధ్వంసం చేసిన వారిలో కవిత పేరును ప్రస్తావించింది. సౌత్ గ్రూపు నుంచి రూ.100కోట్ల లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో గుర్తించామని స్పష్టం చేసింది.  సమీర్ మహేంద్ర నుంచి విజయ్ నాయర్ భారీగా ముడుపులు అందుకోవడంతో పాటు కవిత సన్నిహితుడైన అరుణ్ పిళ్లై సైతం భారీగా ప్రయోజనం పొందిన విషయాన్ని ప్రస్తావించింది.