అధికారంలోకి వస్తే.. విద్య, వైద్యం, విద్యుత్ ఫ్రీ : సోమనాథ్ భారతి

అధికారంలోకి వస్తే.. విద్య, వైద్యం, విద్యుత్ ఫ్రీ :  సోమనాథ్ భారతి

ముషీరాబాద్,వెలుగు : తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే విద్య, వైద్యం, విద్యుత్ ఉచితంగా అందిస్తామని ఆ పార్టీ ఢిల్లీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఇన్​చార్జి సోమనాథ్ భారతి హామీ ఇచ్చారు. ప్రజాసేవలో మార్పు తీసుకురావడానికి తమ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఢిల్లీ, పంజాబ్ లోని సంక్షేమ పథకాలను ఇక్కడ కూడా అమలు చేస్తామని చెప్పారు. ఆదివారం బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కళ్యాణ మండపంలో పార్టీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో కోర్ కమిటీ సభ్యుడు శోభన్ భూక్య అధ్యక్షతన సామాన్యుడి సమర భేరి సదస్సు జరిగింది. ఈసందర్భంగా సోమనాథ్ భారతి మాట్లాడుతూ.. 10 ఏళ్లలోనే పార్టీ జాతీయస్థాయికి ఎదిగి బీజేపీకి ప్రధాన పోటీదారుగా మారిందన్నారు.

 దేశవ్యాప్తంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు పెరుగుతున్న ప్రజాదరణ చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారన్నారు.  అందుకే ఆప్ నేతలను టార్గెట్ చేసి బెదిరింపులకు పాల్పడుతూ  జైల్లోకి పంపిస్తున్నారని  ఆరోపించారు. భగత్ సింగ్, అంబేద్కర్ ను తమ పార్టీ అనుసరిస్తుందని, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. పార్టీ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. బూత్​స్థాయి నుంచి ఆప్ ను బలోపేతం చేస్తున్నామన్నారు. ఈ సదస్సులో  అధికార ప్రతినిధి వినయ్ రెడ్డి, బుర్ర రాము గౌడ్, హేమ జిల్లోజు, యమునా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.