రోజురోజుకూ ముదురుతున్న నిజాం కాలేజీలో హాస్టల్ కేటాయింపు వివాదం

రోజురోజుకూ ముదురుతున్న నిజాం కాలేజీలో హాస్టల్ కేటాయింపు వివాదం

హైదరాబాద్, వెలుగు: నిజాం కాలేజీలో హాస్టల్ కేటాయింపు వివాదం రోజురోజుకూ ముదురుతోంది. సమస్యను పరిష్కరించాలని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడంతో విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఓయూ వీసీ రవీందర్‌‌‌‌తో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం సమీక్షించి స్టూడెంట్లతో మాట్లాడాలని ఆదేశించారు. దీంతో గురువారం ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీసులో స్టూడెంట్లతో నవీన్ మిట్టల్, నిజాం కాలేజీ ప్రిన్సిపల్ భీమానాయక్, ఇతర అధికారులు సమావేశం నిర్వహించారు. హాస్టల్ ని పీజీ విద్యార్థులకే కేటాయిస్తామని, కుదిరితే సగం యూజీకి, సగం పీజీ విద్యార్థులకు ఇస్తామని సమావేశంలో నవీన్ మిట్టల్ చెప్పగా తాము ఒప్పుకోలేదని స్టూడెంట్లు వెల్లడించారు.

యూజీ విద్యార్థులకు హాస్టల్​ను కేటాయించాల్సిందేనని, అప్పటివరకు ఆందోళన ఆపబోమని చెప్పామన్నారు. అయితే, ఇలా చర్చలు జరుగుతున్న సమయంలోనే నవీన్ మిట్టల్ ఆగ్రహంతో స్పందించారని, ఆందోళనలు ఆపకపోతే యాక్షన్ తీసుకోవాలని పోలీసులను ఆదేశించామంటూ బెదిరించారని స్టూడెంట్లు తెలిపారు. ఆందోళన చేసిన స్టూడెంట్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పామని కూడా హెచ్చరించారని పేర్కొన్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ తమతో ఇలా దురుసుగా మాట్లాడటం ఊహించలేదన్నారు. తమకు వంద శాతం హాస్టల్​ని కేటాయించే వరకు నిరసన కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.