నిఘా నీడలో టెన్త్ పరీక్షలు

నిఘా నీడలో టెన్త్ పరీక్షలు
  •     సీసీ కెమెరాల ముందు క్వశ్చన్ పేపర్లు ఓపెన్ 

హైదరాబాద్, వెలుగు : ఈనెల18 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్  పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యా శాఖ ఏర్పాట్లు చేసింది. గత అనుభవాల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లోకి ఎవ్వరి సెల్ ఫోన్లనూ అనుమతించకూడదని నిర్ణయం తీసుకుంది. చివరికి తనిఖీలకు వచ్చే ఆఫీసర్లూ ఫోన్లు బయటే పెట్టిరావాలని ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో ఈనెల18 నుంచి ఏప్రిల్ 2 వరకు టెన్త్  పబ్లిక్  పరీక్షలు జరగనున్నాయి. 5,08,385 మంది స్టూడెంట్లు హాజరుకానున్నారు.

వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా సెంటర్లలో విధులు నిర్వహించేందుకు 30 వేల మంది ఇన్విజిలేటర్లను నియమించారు. వీరితో పాటు 2,676 మంది చీఫ్  సూపరింటెండెంట్లు, మరో 2,676 మంది డిపార్ట్ మెంటల్  ఆఫీసర్లను నియమించారు. సైన్స్  మినహా అన్ని సబ్జెక్టుల పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ  కొనసాగనున్నాయి. ఈనెల 26, 27న తేదీల్లో జరిగే ఫిజిక్స్, బయోలజీ పేపర్లకు మాత్రం ఉదయం 9.30 నుంచి11 గంటల వరకూ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.

ఉదయం 8.30 గంటల నుంచే విద్యార్థులను సెంటర్లలోకి అనుమతిస్తారు. నిరుడిలాగే ఈసారి కూడా 9.30 గంటల తర్వాత ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులనూ పరీక్షా కేంద్రాలోకి రానిస్తారు. అయితే, క్వశ్చన్  పేపర్లను సీఎస్​ రూములోని సీసీ కెమెరాల ముందు ఓపెన్   చేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. పరీక్షా కేంద్రంలో ఏ చిన్న ఘటన జరిగినా దానికి సెంటర్  చీఫ్​ సూపరింటెండెంట్  బాధ్యత వహించాల్సి ఉంటుందని

 ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్  కృష్ణారావు తెలిపారు. పరీక్షా కేంద్రంలో ఏమైనా ఘటనలు జరిగితే దానికి ఇన్విజిలేటర్​దే బాధ్యత అని ఆయన చెప్పారు. ఏమైనా ఇబ్బందులుంటే ప్రభుత్వ పరీక్షల విభాగం ఆఫీస్ లోని హెల్ప్ లైన్  నంబర్​ 040– 2323 0942 కు కాల్ చేయాలని సూచించారు.