సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా .. ఎస్జీటీ పోస్టులు డీఎడ్ వాళ్లకే

సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ..   ఎస్జీటీ పోస్టులు డీఎడ్ వాళ్లకే
  •     ఒకటి.. రెండ్రోజుల్లో సర్కార్ అధికారిక జీవో
  •     పదిరోజుల పాటు ఆన్​లైన్ ఎగ్జామ్స్
  •     షెడ్యూల్ సిద్ధం చేస్తున్న విద్యాశాఖ 

హైదరాబాద్, వెలుగు : సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్​జీటీ) పోస్టులను డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులతోనే భర్తీ చేసేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. బీఈడీ చేసిన అభ్యర్థులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే పరిమితం చేయనుంది. దీనికి సంబంధించిన జీవో ఒకటి.. రెండు రోజుల్లో అధికారికంగా సర్కారు రిలీజ్ చేయనున్నది. రాష్ట్రంలో 5,089 టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు సర్కారు నిర్ణయించింది. దీంట్లో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్​జీటీ) 2,575 పోస్టులుండగా, స్కూల్ అసిస్టెంట్లు (ఎస్​ఏ)1,739 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్లు 611, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు (పీఈటీ) 164  పోస్టులు న్నాయి.

వీటితో పాటు ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల కోసం ప్రైమరీ స్కూళ్లలో 796, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో 727 పోస్టులను భర్తీ చేయనున్నారు. టీఎస్ టెట్ ఎగ్జామ్ తర్వాత ఈ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కాగా, ఇది వరకు బీఈడీ చేసిన అభ్యర్థులకు ఎస్​ఏతో పాటు ఎస్​జీటీ పోస్టులకూ అర్హులుగా ఉండేవారు. కానీ, దీన్ని కొట్టివేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. బీఈడీ అభ్యర్థులు కేవలం స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే పరిమితం చేసింది. దీన్ని త్వరలో జరిగే డీఎస్సీకి అమలు చేయనున్నారు.

అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా సెంటర్లు 

గతంలో రెండు రోజుల్లో డీఎస్సీ రాత పరీక్షలు ఉండేవి. కానీ, ఈ సారి టీచర్ పోస్టుల భర్తీని ఆన్​లైన్ విధానంలో చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. 2017 టీఆర్టీ సమయంలో 2.75 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి 3 లక్షల వరకు అప్లికేషన్లు వచ్చే అవకాశముందని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా ముందుగానే పది రోజుల పాటు ఆన్​లైన్ ఎగ్జామ్ సెంటర్లను బుక్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ ఫస్ట్ వీక్​లో పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు.  అయితే, షెడ్యూల్ కుదురకపోతే నవంబర్ చివర్లోనూ పెట్టే యోచనలో అధికారులున్నారు.