ఇంజినీరింగ్ కాలేజీల్లో 62 వేల సీట్లు

ఇంజినీరింగ్ కాలేజీల్లో 62 వేల సీట్లు
  • సివిల్, మెకానికల్ సీట్లను తగ్గించిన మేనేజ్ మెంట్లు 
  • కంప్యూటర్ సైన్స్ సీట్ల పెంపుకు సర్కారు ప్రతిపాదనలు 
  • మరో పదివేల సీట్లు  పెరిగే అవకాశం 
  • ఇవ్వాల్టి నుంచి ఎంసెట్ వెబ్  ఆప్షన్లు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంజినీరింగ్  కాలేజీల్లో సీట్లను విద్యాశాఖ ఖరారు చేయనుంది. బుధవారం నుంచి ఎంసెట్  అడ్మిషన్  కౌన్సెలింగ్  వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ రాష్ట్రంలో 62,079 సీట్లు కన్వీనర్  కోటాలో  ఉన్నట్లు తేల్చింది. మరో  రెండు మూడు రోజుల్లో ఇంకొన్ని కాలేజీలు చేరే అవకాశముంది. టీఎస్​ ఎంసెట్ అడ్మిషన్  కౌన్సెలింగ్  ప్రక్రియ ఆదివారం మొదలైంది. ప్రస్తుతం రిజిస్ర్టేషన్లు, ఆన్​లైన్ కౌన్సెలింగ్  ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల పరిశీలన, స్లాట్ బుకింగ్ ప్రక్రియ నడుస్తున్నది. మంగళవారం రాత్రి వరకు 54,029 మంది స్లాట్  బుక్  చేసుకున్నారు. బుధవారం నుంచి వెబ్ కౌన్సెలింగ్  ప్రక్రియ మొదలు కానుంది. దీంతో ఇప్పటి వరకూ జేఎన్టీయూ, ఓయూ, కేయూతో పాటు పలు వర్సిటీల పరిధిలోని కాలేజీల్లో సీట్లు, బ్రాంచుల వివరాలను విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 155 ఇంజినీరింగ్  కాలేజీలు వర్సిటీల గుర్తింపు పొందగా, వాటిలో 62,079 కన్వీనర్  సీట్లు ఉన్నాయి. ఓయూ పరిధిలో 14 కాలేజీలు ఉండగా 5747 సీట్లు, జేఎన్టీయూ పరిధిలో 122 కాలేజీల్లో 49,561 సీట్లు, కేయూ పరిధిలో ఒక కాలేజీ పరిధిలో 756 సీట్లు ఉన్నాయి. వాటితో పాటు వర్సిటీ, కాన్సిట్యుయెంట్ కాలేజీలు 16 ఉండగా వాటిలో 4713 సీట్లు, రెండు ప్రైవేటు వర్సిటీల్లో 1302 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే నిరుడు 176 కాలేజీలు ఉండగా, వాటిలో 72,400 సీట్లు ఉండె. ఈసారి పదివేలకు పైగా సీట్లు తగ్గాయి. ప్రధానంగా మరో 15కు పైగా ఇంజినీరింగ్ కాలేజీలకు జేఎన్టీయూ గుర్తింపు ఇవ్వాల్సి ఉంది. 

సివిల్, మెకానికల్  సీట్లు తగ్గించారు

ప్రస్తుతం కంప్యూటర్  సైన్స్  సీట్లకు డిమాండ్ పెరగడంతో  సివిల్, మెకానికల్, ఎలక్ర్టానిక్స్ డిపార్ట్ మెంట్ల సీట్లకు డిమాండ్  తగ్గింది. దీంతో చాలా ప్రైవేటు కాలేజీల మేనేజ్ మెంట్లు సివిల్  మెకానికల్  తదితర  కోర్సుల్లో సీట్లకు కోతపెట్టి, కంప్యూటర్  సైన్స్  సీట్ల కోసం వర్సిటీలకు ప్రతిపాదనలు పెట్టుకున్నారు. దీనిపై సర్కారు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంది. ఈ లెక్కన సుమారు 15 వేలకు పైగా కొత్త సీట్లకు సర్కారు పర్మిషన్ ఇచ్చే అవకాశముందని వర్సిటీ వర్గాలు చెప్తున్నాయి. 

సీఎస్ఈలోనే 16,617 సీట్లు

ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ లో 45 బ్రాంచులు ఉండగా వాటిలో కంప్యూటర్ సైన్స్ లోనే ఎక్కువ సీట్లు ఉన్నాయి. కంప్యూటర్  సైన్స్  అండ్  ఇంజినీరింగ్ (సీఎస్ఈ) బ్రాంచులో అత్యధికంగా 16,617 సీట్లు ఉండగా ఎలక్ర్టానిక్స్  అండ్  కమ్యూనికేషన్  ఇంజినీరింగ్  (ఈసీఈ) లో 10,394 సీట్లు, సీఎస్ఈ (ఆర్టిఫిషియల్  ఇంటెలిజెన్స్ అండ్  మెషీన్ లర్నింగ్) బ్రాంచులో 8,154 సీట్లు ఉన్నాయి. సివిల్ ఇంజినీరింగ్​లో 3,567 సీట్లు, సీఎస్ఈ డేటా సైన్స్​ లో 4,635 సీట్లు, ఎలక్ర్టికల్స్  అండ్  ఎలక్ర్టానిక్స్  ఇంజినీరింగ్​ (ఈఈఈ) లో 4454 సీట్లు , ఇన్ఫర్మేషన్  టెక్నాలజీలో (ఐటీ) 3,936  సీట్లున్నాయి.