వెలుగు ఓపెన్ పేజీ : అందరికీ విద్య కాకా ఆశయం..ఇవాళ(డిసెంబర్ 22) కాకా వర్ధంతి

వెలుగు ఓపెన్ పేజీ :  అందరికీ విద్య కాకా ఆశయం..ఇవాళ(డిసెంబర్ 22) కాకా వర్ధంతి

గడ్డం వెంకటస్వామి (కాకా) 1929 అక్టోబర్ 5న  నిజాం సంస్థానంలోని  హైదరాబాద్​లో  జన్మించారు.  వారి తల్లిదండ్రులు పెంటమ్మ,  మల్లయ్య.  వెంకటస్వామి విద్యార్థి దశలోనే స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని,  మహాత్మా గాంధీని  చూసి  ప్రేరణ పొందిన నాయకుడు.  ఆర్య సమాజ్ కార్యక్రమాలలో చురుగ్గా  పాల్గొనేవారు.  నిజాం వ్యతిరేక పోరాటంలో,  స్వతంత్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని గొప్ప దార్శనికతగల నాయకుడిగా ఎదిగారు.  దేశంలోనే గొప్ప కార్మిక నాయకుడిగా పేరుపొందడంతోపాటు నాటి ప్రధాని ఇందిరాగాంధీ మన్ననలను కూడా పొందారు. 

అంతర్జాతీయ కార్మిక సదస్సుకు భారత ప్రతినిధి బృందానికి నాయకుడుగా కాకా ప్రాతినిధ్యం వహించారు.  వెంకటస్వామి ఏడుసార్లు ఎంపీగా,  కేంద్రంలో  కార్మిక,  గ్రామీణాభివృద్ధిశాఖ మాత్యులుగా,  రాష్ట్రంలో కార్మికశాఖ మంత్రిగా పనిచేసి..  ప్రజా ప్రయోజనాలకోసం చరిత్రలో  నిలిచే అనేక సంక్షేమచట్టాలు రూపొందించిన ఘనత వీరిది.  వెంకటస్వామికి ప్రజా సమస్యలపై  సత్వరం స్పందించే స్వభావం,  వాటిని పరిష్కరించే నిబద్ధత, పట్టుదల, అందరినీ కలుపుకొనిపోయే నాయకత్వ లక్షణాలు ఉండేవి.  పైకి సాధారణంగా కనిపించినా  అసాధారణమైన పనులు చేసి అందరినీ ప్రభావితం చేయగలిగే  పోరాటపటిమగల నాయకుడు.  గొప్ప  ఆత్మవిశ్వాసం,  ధైర్యసాహసాలుగల  ప్రజానాయకుడు.  డిసెంబర్ 22,  2014న  కాకా  మరణించారు.  కానీ,  వారు చేసిన సేవలు,  నిర్మించిన సంస్థలు,  వారితో ఉన్న బంధాలను,  వారి ప్రభావాన్ని  ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు.

1950లో అంబేద్కర్​ను కలిసిన తరువాత..

ప్రతి సంవత్సరం వెంకటస్వామి వర్ధంతిని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఎడ్యుకేషన్ ఇన్​స్టిట్యూషన్స్ అల్యూమినిడేగా  నిర్వహించుకుంటారు. అందరికీ విద్య అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో 1973లో హైదరాబాద్​లో  డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషన్ సొసైటీని  ప్రజలందరూ  ప్రేమగా,  గౌరవంగా కాకా అని పిలుచుకునే వెంకటస్వామి  స్థాపించారు.  ఈ సంస్థల  ప్రారంభోత్సవానికి అప్పటి భారత రాష్ట్రపతి  వీ.వీ. గిరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  వీరు 1950లో  అంబేద్కర్​ను  కలిసిన తరువాత విద్య సమాజాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని గ్రహించి,  విద్యా సాధికారతను  మించినది ఏదీ లేదనే ఉద్దేశ్యంతో ఈ సంస్థలను నిర్వహించారు.  వీరు ఉన్నతవిద్యను చదవలేకపోయినా.. సమాజం అనే విశ్వవిద్యాలయంలో తన పరిశీలన,  అనుభం ద్వారా  విద్య  ప్రాముఖ్యతను గుర్తించారు.  గత  52 ఏండ్లుగా  ఈ  విద్యాసంస్థలు లక్షలాదిమంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను,  ఉపాధిని,  నైపుణ్యాలను అందిస్తున్నాయి. రాష్ట్రంలో  ‘నాక్’ గుర్తింపు పొంది ‘యూజీసీ’,  ‘అటానమస్ స్టేటస్’  పొందిన కళాశాలలుగా  పేదలకు, దళితులకు  ఎన్నో రకాల  సంక్షేమ వసతులతో  కూడిన విద్యను అందిస్తున్నాయి. 

నాణ్యమైన విద్య

ఈ విద్యాసంస్థలలో చదివిన విద్యార్థులు అన్ని రంగాలలో గొప్పగా రాణిస్తున్నారు. విద్యాసంస్థల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధిస్తూ,  అవార్డులు పొందుతున్నారు.  పూర్వ విద్యార్థులు  ఉప ముఖ్యమంత్రిగా,  స్పీకర్ గా,  పబ్లిక్  సర్వీస్  కమిషన్ చైర్మన్​గా,  మంత్రులుగా,  ఎమ్మెల్యేలుగా,  ఐఏఎస్, ఐపీఎస్,  జడ్జిలుగా,  విద్యాసంస్థల అధినేతలుగా, వ్యాపారస్తులుగా  ఈ విధంగా అనేక హోదాలలో ఎదిగారు.  1973 నుంచి 2025 వరకు నాణ్యమైన విద్యను అందిస్తూ,  సమకాలిన సమాజ అవసరాలకు తగ్గట్టు జాతీయ,  అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు పోటీపడేవిధంగా తీర్చిదిద్దటంలో,  విద్యాసంస్థలు ఎంతో  నిబద్ధతతో పనిచేస్తున్నాయి.  గత ఐదు దశాబ్దాలుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషన్ ఇన్​స్టిట్యూషన్స్ నిరంతర  అభివృద్ధిని  సాధిస్తున్నాయి.  ప్రాథమిక పాఠశాలల నుంచి ఇంటర్మీడియట్,  డిగ్రీ,  లా, ఎంబీఏ తదితర  కళాశాలలుగా విస్తరించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి.  విద్యార్థుల సంక్షేమంకోసం 
 ప్రత్యేక కార్యక్రమాలను కెరీర్  గైడెన్స్,  ఉద్యోగ అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలను అన్ని కోర్సులలో సమీకృతం చేసి నిరంతర శిక్షణ అందిస్తున్నారు.  పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి శిక్షణ, సాఫ్ట్​వేర్​ స్కిల్స్,  కౌన్సెలింగ్,  పర్సనాలిటీ  డెవలప్​మెంట్​ యాక్టివిటీస్​ను   నిరంతరం  నిర్వహిస్తున్నారు.  

సీఐఐ గ్లోబల్ అవార్డు

విద్యార్థులు ఉన్నతంగా ఎదిగే క్రమంలో  జీవిత లక్ష్యాన్ని  ఏర్పరుచుకోవడానికి  మెంటర్ షిప్,  ఉపాధి అవకాశాలను పెంచడానికి ఇంటర్న్ షిప్,  మెరిట్ విద్యార్థులకు  ఫ్రీ షిప్ ప్రోగ్రాం కూడా ఎంతోమంది పేద విద్యార్థులకు చదువులు కొనసాగించే అవకాశం కల్పిస్తుంది.   గేమ్స్ అండ్ స్పోర్ట్స్,  ఎక్స్‌‌‌‌టెన్షన్ యాక్టివిటీస్ అన్నింటిని యజమాన్యం సపోర్ట్ చేస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు.  అంతేకాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో  విద్యాసంస్థలు, పరిశ్రమలు, విద్యార్థులకు ఉపయోగపడే అనేక సంస్థలతో  ఎంవోయూ  కుదుర్చుకొని విద్యార్థులకు ఉపాధి అవకాశాలు, ఎంప్లాయిబిలిటీని పెంచడంలో నిబద్ధతతో కృషి చేస్తున్నాయి.  ఈ ప్రయత్నాలకు గుర్తింపుగా 2025 సంవత్సరానికిగాను,  సీఐఐ ఇండస్ట్రీ అకాడమియా పార్టనర్​షిప్​ అవార్డు లభించడం డాక్టర్  బీఆర్  అంబేద్కర్ ఎడ్యుకేషన్ ఇన్​స్టిట్యూషన్స్ ప్రయాణంలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఈ అవార్డు సంస్థలు చేపడుతున్న నాణ్యమైన విద్య, శిక్షణ కార్యక్రమాలకు, విద్యాసంస్థలతో  పరిశ్రమల అనుసంధానం చేపడుతున్న కార్యక్రమాలకు దేశ స్థాయి  గుర్తింపుగా నిలిచింది.  వ్యవస్థాపకులు కాకా వెంకటస్వామి ఆలోచనలు,  విలువలు  దళిత  బహుజన సాధికారతపై ఆయన కలల్ని ప్రతిబింబిస్తూ సమాజ మార్పుకు కృషి చేస్తున్నారు.

- ప్రొఫెసర్
ఆర్. లింబాద్రి