- మెడికల్ ఎడ్యుకేషన్‌లో డిజిటల్ ప్రయోగానికి ప్రభుత్వం ఆలోచన
- సిమ్యులేషన్ టూల్స్‌తో క్లాస్‌లు..
- మెడికోలకు డీప్‌గా అర్థమయ్యేలా పాఠాలు డిజిటలైజేషన్
- 3డీ లో గుండె, కిడ్నీలు.. వీఆర్ టెక్నాలజీతో ఈజీగా సబ్జెక్ట్
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చదువులు డిజిటలైజ్ కానున్నాయి. ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు ఇక వర్చువల్ పాఠాలు చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ముఖ్యంగా ఫస్ట్ ఇయర్‌లో అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ సబ్జెక్టులను ఇకపై వర్చువల్ టెక్నాలజీ, సిమ్యులేషన్ టూల్స్ ద్వారా నేర్పించబోతున్నారు. శవాల కొరత ఉన్న చోట, ఫ్యాకల్టీ తక్కువ ఉన్న కాలేజీల్లో ఈ టెక్నాలజీ అద్భుతంగా పనిచేస్తుందని ఆఫీసర్లు భావిస్తున్నారు. దీనికోసం వైద్యారోగ్య శాఖ పలు సంస్థలతో చర్చలు జరుపుతున్నది. మరో రెండు, మూడు నెలల్లోనే ఈ డిజిటల్ మార్పు మొదలయ్యే చాన్స్ ఉన్నది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) ఆదేశాల ప్రకారం లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎల్ఎంఎస్)లో భాగంగా ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో దీన్ని అమలు చేయనున్నారు. టెక్నాలజీపరంగా ఉస్మానియా, గాంధీ, ఎంజీఎం హాస్పిటల్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా వ్యవహరించనున్నాయి.
డెడ్‌బాడీల కొరత అధిగమించేలా..
మెడికల్ కాలేజీల్లో డెడ్ బాడీల కొరత ప్రధాన సమస్యగా ఉన్నది. ఎన్ఎంసీ (ఎన్ఎంఎసీ) రూల్స్ ప్రకారం ప్రాక్టికల్స్‌లో ప్రతి 10 మంది స్టూడెంట్లకు ఒక కెడవర్ ఉండాలి. కానీ మన దగ్గర ఆ పరిస్థితి లేదు. కొన్ని మెడికల్ కాలేజీల్లో పది డెడ్ బాడీలు అవసరం పడితే.. ఐదారు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. దీంతో మెడికల్ కాలేజీల్లో ఒక్కో బాడీ మీద 30 మందికిపైగా కుస్తీ పడాల్సిన పరిస్థితి ఉంది. దీంతో చాలామంది విద్యార్థులకు పాఠాలు సగం సగం మాత్రమే అర్థమవుతున్నాయి. గతంలో అసలు అనాటమీ డీసెక్షన్ జరగకుండానే కొందరు విద్యార్థులు ఎంబీబీఎస్ పూర్తి చేశారనే విమర్శలూ ఉన్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు సిమ్యులేషన్ టూల్స్ విధానాన్ని ఆరోగ్య శాఖ అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం కెడవర్ డిసెక్షన్ (శవ పరీక్ష) తప్పనిసరి అయినప్పటికీ.. విద్యార్థులకు మరింత డీప్‌గా అర్థమయ్యేలా చెప్పడానికి అదనంగా ఈ సిమ్యులేషన్ టూల్స్ వాడనున్నారు.
విదేశాల్లో ఎక్కువ శాతం
సిమ్యులేషన్ టూల్స్ ద్వారానే
అమెరికా, లండన్‌లాంటి దేశాల్లో సిమ్యులేషన్ టూల్స్ ద్వారా అనాటమీ ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నది. అక్కడ ఎక్కువ శాతం ట్రైనింగ్ అంతా విధానంలోనే నడుస్తుంది. నిజమైన బాడీని ముట్టుకుంటే వచ్చే టచ్ , ఫీల్ ఇందులో మిస్ అయినా.. సబ్జెక్ట్ క్లారిటీలో మాత్రం నేచురల్ బాడీ కంటే సిమ్యులేషనే బెస్ట్ అని డాక్టర్లు చెబుతున్నారు. బాడీ పార్ట్స్ అన్నీ విడదీసి, జూమ్ చేసి క్లియర్‌గా చూడొచ్చు అని పేర్కొంటున్నారు.
పాఠం అర్థం కాకుంటే మళ్లీ వినొచ్చు
కొత్తగా రాబోతున్న లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో స్టూడెంట్లకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రొఫెసర్ క్లాస్ చెప్పినప్పుడు అర్థం కాకపోతే.. ఆ తర్వాత యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఆ వీడియోను ఎన్నిసార్లయినా మళ్లీ చూడొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. డిజిటల్ బోర్డుల మీద గ్రాఫిక్స్, వాయిస్ ఓవర్‌తో పాఠాలు చెప్తారు కాబట్టి విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవచ్చంటున్నారు. విద్యార్థులు ఎప్పుడైనా, ఎక్కడైనా వాటిని చదువుకోవచ్చు. ప్రతి టాపిక్‌ను ఒక మాడ్యూల్‌గా విడగొడతారు. ఉదాహరణకు హార్ట్ అనాటమీ తీసుకుంటే.. అందులో థియరీ, వీడియోలు, సెల్ఫ్ టెస్టులు అన్నీ ఉంటాయి. ప్రతి పాఠం చివర ఆన్‌లైన్ క్విజ్ ఉంటుంది. అది రాస్తేనే స్టూడెంట్‌కు ఎంత అర్థమైందో ఫ్యాకల్టీకి తెలుస్తుంది.
కళ్ల ముందే 3డీలోగుండె, కిడ్నీలు...
క్లిష్టమైన అనాటమీ పాఠాలు, ఆపరేషన్ ప్రొసీజర్లు ఈజీగా అర్థమయ్యేందుకు వర్చువల్ రియాలిటీ (వీఆర్) వాడనున్నారు. ఈ టెక్నాలజీతో గుండె ఎలా కొట్టుకుంటున్నది? కిడ్నీలు ఎక్కడ ఉన్నాయి? నరాలు ఎలా పాకుతున్నాయి? అనేవి అచ్చం కళ్ల ముందే గాలిలో తేలుతున్నట్టు 3డీలో కనిపిస్తాయి. వీటిని అటు.. ఇటు తిప్పి, జూమ్ చేసి, లోపల ఏముందో క్లియర్‌గా చూసుకునే చాన్స్ ఉంటుంది. పుస్తక చదువుల కంటే.. ఇలా కళ్లారా చూసి నేర్చుకుంటేనే మెడికల్ విద్యార్థులకు సబ్జెక్ట్ ఈజీగా అర్థమవుతుందని, అందుకే ప్రభుత్వ కాలేజీల్లో ఈ హైటెక్ ఎడ్యుకేషన్ తీసుకొస్తున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.
