చదువు.. మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచుతది

చదువు.. మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచుతది
  • ఓయూ లా కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయలక్ష్మి
  • అంబేద్కర్ విద్యాసంస్థల్లో ఘనంగా ఉమెన్స్ డే వేడుకలు

ముషీరాబాద్,వెలుగు: జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి పూలే, అంబేద్కర్ వంటి మహానుభావుల కృషి వల్లే మహిళలకు హక్కులు వచ్చాయని ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయలక్ష్మి అన్నారు. మంగళవారం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా హైదరాబాద్ బాగ్ లింగంపల్లి అంబేద్కర్ విద్యాసంస్థల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓయూ లా కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయలక్ష్మి, ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. మహిళ లేకపోతే సృష్టి లేదని, అలాంటి వారిపై రోజురోజుకు క్రైమ్స్ పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి సమాజంలో మహిళలపై వివక్ష కొనసాగుతోందన్నారు.  విద్య మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచి,ముందుకు సాగేలా చేస్తుందని తెలిపారు.

మగవాడి విజయం వెనుక మహిళ ఉన్నట్టే... మహిళ విజయం వెనుక ఒక పురుషుడు ఉంటారని గుర్తుంచుకోవాలన్నారు. నైనా జైస్వాల్ మాట్లాడుతూ.. సమాజంలో మహిళల పట్ల చిన్నచూపు పోవాలన్నారు. చదువుతో పాటు విద్యార్థులకు సంస్కారం కూడా అవసరమన్నారు.  విద్యను దాచుకోవడం కన్నా పంచడం ముఖ్యమని భావించి సరోజా వివేక్.. అంబేద్కర్ ఎడ్యుకేషన్ ఇన్​స్టిట్యూట్ ను ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. ఉమెన్స్ డే సందర్భంగా స్టూడెంట్స్​ఆట పాటలు అలరించాయి. జీవిత పోరాటంలో మహిళ పాత్ర గురించి చేసిన స్క్రిప్టు అక్కడున్న వారిని ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్​ లా కాలేజ్ ప్రిన్సిపాల్ సృజన, ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపాల్ వసుంధర, విద్యాసంస్థల స్టూడెంట్స్​, స్టాఫ్​ పాల్గొన్నారు.