
విద్యారంగం విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర విద్యారంగంలో గడిచిన పందేండ్లలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 21 రోజుల పాటు విద్యారంగంలోని విజయాలను ప్రచారం చేయాలన్నారు. జూన్ 20న నిర్వహించే రాష్ట్ర విద్యాదినోత్సవాన్ని సక్సెస్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం మంత్రి తన కార్యాలయంలో విద్యాశాఖ పనితీరును సమీక్షించారు.
రాష్ట్రంలోని ప్రైమరీ స్కూల్ నుంచి పీజీ వరకూ అన్ని విద్యాసంస్థల్లో సభలు, సమావేశాలను నిర్వహించాలని సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ‘మన ఊరు మన బడి’ స్కీమ్ కింద మొదటి విడతలో రూ.3,497.62 కోట్లతో 9,123 స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 10 వేల లైబ్రరీలు, 1600 డిజిటల్ క్లాస్ రూమ్ లను ఒకే రోజున ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.