పారదర్శకంగా డబుల్ ఇండ్ల కేటాయింపు : సబితా ఇంద్రారెడ్డి

పారదర్శకంగా డబుల్ ఇండ్ల కేటాయింపు : సబితా ఇంద్రారెడ్డి
  • విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
  • రంగారెడ్డి కలెక్టరేట్​లో లక్కీ డ్రా తీసి లబ్ధిదారుల ఎంపిక  

రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు : పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పారదర్శకంగా కేటాయిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ లోని కలెక్టరేట్ లో ఆన్ లైన్ ద్వారా రాజేంద్రనగర్, ఎల్​బీనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి నియోజకవర్గాల నుంచి 500 చొప్పున 2 వేల మందిని మంత్రి సమక్షంలో జిల్లా అధికారులు ఎంపిక చేశారు.  అనంతరం మంత్రి మాట్లాడుతూ పేదలు ఆత్మగౌరవంతో జీవించేందుకు అన్ని సౌకర్యాలతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించినట్టు చెప్పారు. రాజేంద్రనగర్ - 4,166, ఎల్​బీనగర్ 4,752, మహేశ్వరం- 651, శేర్లింగంపల్లి-12,479 దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేశామని తెలిపారు. 

మిగతా వారికి విడతలుగా కేటాయిస్తామని, ఎవరి జోక్యం లేకుండా పారదర్శకంగా చేస్తున్నట్టు పేర్కొన్నారు.  కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, జడ్పీ చైర్ పర్సన్ అనిత, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్​ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, షాద్ నగర్​ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, జిల్లా అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, భూపాల్‌‌‌‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. అయితే.. అన్ని నియోజకవర్గాల్లో వేలల్లో దరఖాస్తుల్లో రాగా.. ర్యాండమైజేషన్ సాఫ్ట్ వేర్ ద్వారా ఆన్ లైన్ డ్రా తీసి 500 మందిని మాత్రమే ఎంపిక చేశారు. 

మంత్రి సొంత నియోజకవర్గంలో మాత్రం కేవలం 651 దరఖాస్తుల్లో నుండే 500 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. దీంతో 151 మందికి రాలేదు. తక్కువ మంది లిస్టును తయారు చేసి కావాలనే అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేశారని, సాఫ్ట్​వేర్​లో కూడా తన మార్క్​ను మంత్రి చూపించాలని పలువురు విమర్శిస్తున్నారు.