- ఎల్ఎల్బీ గరిష్ట ఫీజు రూ.40,300, ఎల్ఎల్ఎంకు రూ.50,400
- బీఈడీ గరిష్ట ఫీజు రూ. 50,800, ఎంఈడీ ఫీజు రూ.45 వేలు ఫిక్స్
- మూడేండ్ల పాటు ఇవే ఫీజులు కొనసాగింపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ లా కాలేజీల్లో ఎల్ఎల్బీ(3 ఏళ్లు, 5 ఏళ్లు), ఎల్ఎల్ఎం కోర్సుల ఫీజులను సర్కారు ఖరారు చేసింది. అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. ఈ కొత్త ఫీజులు 2025–26 విద్యాసంవత్సరం నుంచి 2027–28 వరకూ ఉంటాయని ప్రకటించింది. ఈ మేరకు జీవోనెంబర్ 11,12లను విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా విడుదల చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 22 లా కాలేజీలు ఉన్నాయి. వీటిలో మూడేండ్ల ఎల్ఎల్బీ కోర్సుకు కనిష్టంగా రూ.20వేలు ఫీజు ఉండగా, గరిష్టంగా రూ.40,300 వరకు నిర్ణయించారు. ఐదేండ్ల ఎల్ఎల్బీ కోర్సుకు గరిష్టంగా రూ.44,800 ఫీజు ఉండగా, అత్యల్పంగా రూ.20వేలు ఉంది. అన్నీ కాలేజీల్లోనూ రూ.50వేల లోపే ఫీజులు ఉన్నాయి. మరోపక్క, స్టేట్లో పీజీ లా కోర్సు (ఎల్ఎల్ఎం) కాలేజీలు 17 ఉన్నాయి.
వీటిలో అత్యధికంగా రూ.50,400 ఫీజు ఫిక్స్ చేయగా, కనిష్టంగా రూ.26,000గా ఉంది. మెజారిటీ కాలేజీల్లో ఫీజులు రూ.30 వేలకు పైనే ఉన్నాయి. విద్యార్థి చేరినప్పుడు ఎంత ఫీజు ఉందో, కోర్సు పూర్తయ్యే వరకు అదే ఫీజు చెల్లించాలని సర్కారు స్పష్టం చేసింది.
బీఈడీ గరిష్ట ఫీజు రూ. 50,800..
రాష్ట్రంలో ప్రైవేట్ బీఈడీ, ఎంఈడీ కాలేజీలు ఖరారయ్యాయి. మూడేండ్ల కాలానికి ఫీజులను నిర్ణయిస్తూ విద్యాశాఖ కార్యదర్శి జీవో 42ను విడుదల చేశారు. స్టేట్ వైడ్గా 204 బీఈడీ కాలేజీలుండగా వాటిలో కనిష్టంగా రూ.16,500 ఫీజు ఖరారు చేయగా, గరిష్టంగా రూ.50,800 నిర్ణయించారు. చాలా కాలేజీల్లో ఫీజులు రూ.30 వేల నుంచి రూ.35 వేల మధ్యలో ఉన్నాయి. ఎంఈడీ కోర్సులో గరిష్టంగా రూ.45వేలు , కనిష్టంగా రూ.25వేలుగా నిర్ణయించారు.
అలాగే బీపీఈడీ కోర్సుల్లో కనిష్టంగా రూ.19వేల నుంచి రూ.32వేల వరకు, ఎంపీఈడీ కనిష్టంగా రూ.27వేలు, గరిష్టంగా రూ.32,400 వరకు ఫీజులను ఫిక్స్ చేశారు. యూజీడీపీఈడీ కోర్సుకు రూ.25వేలు ఫీజు,బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ కోర్సులకు అత్యధికంగా 41వేలు, అత్యల్పంగా రూ.36 వేలు నిర్ణయించారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు..
ఫీజుల వసూళ్లపై ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాలకు సర్కారు వార్నింగ్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. నిర్దేశించిన ఫీజు కంటే ఎక్కువగా వసూలు చేయొద్దని ఆదేశించింది. క్యాపిటేషన్ ఫీజులు, డొనేషన్ల పేరుతో అదనపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఫీజులను ఏడాదికి ఒకేసారి గానీ, వాయిదాల పద్ధతిలో గానీ వసూలు చేసుకోవచ్చని తెలిపింది.
