
ముషీరాబాద్,వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ప్రొఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి.. ప్రైవేట్ కార్పొరేట్ విద్యను నియంత్రించే అంశాలను రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ఏజెండాలో చేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం జరిగింది. ఇందులో హర గోపాల్ మాట్లాడుతూ.. నాణ్యతతో కూడిన విద్య ఉంటేనే హింసలు ఆగుతాయని పేర్కొన్నారు. యూనివర్సిటీలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ స్కూల్స్, వర్సిటీలను కాపాడుకోవాలని, కేజీ టు పీజీ అనడమే తప్ప ఎక్కడ కనిపించట్లేదని ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ లో కనీసం 25% నిధులు విద్యారంగానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తుందని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఒకే టీచర్ అన్ని సబ్జెక్టులు బోధిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఎలా నంబర్ వన్ అవుతుందని ప్రశ్నించారు. సమావేశంలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, హన్మేష్, వేములపల్లి వెంకటరామయ్య, గోవర్ధన్, ప్రదీప్, అశోక్, నాగిరెడ్డి, సోమయ్య, రామకృష్ణ, మహేశ్ పాల్గొన్నారు.