తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో12 స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ ప్రభావం!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో12 స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్  ప్రభావం!
  • ప్రధాన పార్టీలకు దీటుగా ప్రచారం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పలు అసెంబ్లీ స్థానాల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్​బీ) పార్టీ కీలకంగా మారింది. రెబల్స్ పార్టీగా పేరున్న ఈ పార్టీ.. పన్నెండు​ స్థానాల్లో ప్రభావం చూపనున్నట్టు తెలుస్తోంది. ఆయా స్థానాల్లో ప్రధాన పార్టీలకు దీటుగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. దీంతో ఈ పార్టీ పోటీతో ఎవరి గెలుపోటములు మారిపోతాయోననే ఆందోళన పెద్ద పార్టీల నేతల్లో మొదలైంది. ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తు అంటేనే రెబల్ అన్నట్టుగా మారిపోయింది. దానికి తగ్గట్టుగానే ప్రధాన పార్టీల్లో టికెట్లు ఆశించి.. సీట్లు రాని నేతలకు, ఉద్యమకారులకు ఫార్వర్డ్ బ్లాక్ టికెట్లు ఇస్తుంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని ఎన్నికల్లోనూ తనకంటూ ప్రత్యేకతను చూపిస్తోంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రామగుండం సెగ్మెంట్ లో ఎమ్మెల్యే స్థానాన్ని గెలుచుకోగా, భూపాలపల్లిలో రెండోస్థానంలో నిలిచింది. ఈ సారి కూడా 42 స్థానాల్లో పోటీ చేస్తోంది. 47 మందికి బీఫామ్స్ ఇచ్చినా.. చివర్లో ఐదుగురు డ్రాప్ అయ్యారు.

 గెలుపోటములపై ఎఫెక్ట్

ప్రస్తుత ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తన మార్కు ను చూపించబోతున్నట్టు కనిపిస్తోంది. కొత్తగూడెం, గద్వాల, షాద్ నగర్​తో పాటు నల్గొండ, హు జూర్​నగర్, కోరుట్ల, ముథోల్, కరీంనగర్ తదితర స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వనున్నట్టు  పేర్కొంటున్నాయి. కొత్తగూడెంలో కాంగ్రెస్​ సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీలో ఉన్నారు. షాద్​నగర్​లో బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ పారిశ్రామికవేత్త విష్ణువర్థన్ రెడ్డి, కోరుట్లలో చెన్నమనేని శ్రీనివాస్​రావు, హుజూర్ నగర్​లో పిల్లుట్ల రఘు, గద్వాలలో నడిగడ్డ హక్కుల పోరాట నాయకులు రంజిత్ రెడ్డి, నల్గొండ నుంచి పిల్లి రామరాజు యాదవ్, ముథోల్ లో బోజిరెడ్డి, కరీంనగర్‌‌ నుంచి జోగిరెడ్డి తదితరులు గట్టి పోటీ ఇస్తారని పార్టీ నేతలు చెప్తున్నారు. ఈసారి కూడా తెలంగాణ అసెంబ్లీలో ఫార్వర్డ్ బ్లాక్ ఎమ్మెల్యే ఉంటాడని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి తెలిపారు.