చలో అసెంబ్లీకి జేఏసీ సభ్యుల యత్నం

చలో అసెంబ్లీకి జేఏసీ సభ్యుల యత్నం

ముషీరాబాద్, వెలుగు : సింగరేణి కాంట్రాక్ట్  కార్మికుల వేతనాలు పెంచాలని, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె నిర్వహించారు. ఇందులో భాగంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి అసెంబ్లీ ముట్టడి చేపట్టగా పోలీసులు జేఏసీ సభ్యులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, ఏఐటీయూసీ సత్యనారాయణ, సీఐటీయూ మధు, హెచ్ఎంఎస్ రమేశ్​, బీఎంఎస్  నాగేశ్వరరావు జేఏసీ సమ్మెకు సంఘీభావం తెలిపారు. వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్  కార్మికులు లేకుండా సింగరేణి లేదన్నారు.

అన్ని విభాగాల్లో కాంట్రాక్ట్  కార్మికులు పనిచేస్తున్నారని, బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి లాభాల్లో ఆ కార్మికుల శ్రమ, రక్తం ఉందన్నారు. చాలీచాలని వేతనాలతో అనేక వేధింపులు, ఒత్తిళ్ల మధ్య కార్మికులు దుర్భర జీవితం  గడుపుతున్నారని తెలిపారు. వేతనాలు పెంపు కోసం కార్మికులు అనేక ఏండ్లుగా పోరాడుతున్నా యాజమాన్యం పట్టించుకోవడంలేదని ఫైరయ్యారు. ఇప్పటికైనా ఎన్టీపీసీతో సహా సింగరేణిలోని అన్ని విభాగాల కాంట్రాక్ట్  కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.