ఆ గ్రామాలను తెలంగాణలో కలిపేందుకు కృషి చేయాలి

ఆ గ్రామాలను తెలంగాణలో కలిపేందుకు కృషి చేయాలి
  • దానివల్లే మొన్న భారీ వరదలు వచ్చినా జనాలు ధైర్యంగా నిద్రపోయారు
  • సెప్టెంబర్​లో నిర్వహించనున్న  భారీ బహిరంగ సభకు  వస్తా 
  • టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు

భద్రాచలం, వెలుగు: శ్రీరాముడి ఆదేశాలతో 20 ఏండ్ల కిందే ముందే గోదావరిపై భద్రాచలం వద్ద కరకట్టలు నిర్మించామని, మొన్నటి వరదల్లో భద్రాచలం టౌన్​ ప్రజలు ధైర్యంగా నిద్రపోయారంటే కేవలం తెలుగుదేశం పార్టీనే కారణమని ఆ పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించేందుకు వచ్చిన ఆయన శుక్రవారం భద్రాద్రి రాములవారిని దర్శించుకున్నారు. తర్వాత గోదావరి కరకట్టను పరిశీలించారు. విలేకరులతో మాట్లాడుతూ ‘స్థానికులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే విధంగా 20 ఏండ్ల  కంటే ముందే గోదావరి తీరాన కరకట్టను కట్టాం. ఆ రోజు వరల్డ్ బ్యాంకు నిధులతో నిర్మించినప్పుడు కొంత మంది ఊహించలేదు. ఈ రోజు దాని ఫలితం చూస్తున్నాం. చాలా వరకు నేను మర్చిపోయి ఉండవచ్చు కానీ ఇక్కడి ప్రజలు గుర్తు పెట్టుకున్నారు’ అని అన్నారు. ప్రస్తుతం ఉన్న కరకట్టను హైట్​ పెంచడంతో పాటు చుట్టూ ఉన్న గ్రామాలకు కూడా కరకట్టలు నిర్మించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందన్నారు.  దాని కోసం తాను కూడా పోరాడుతానన్నారు.  అంతకు ముందు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా పార్టీ లీడర్లతో కొద్దిసేపు ముచ్చటించారు. సెప్టెంబరు రెండో వారంలో పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభకు వస్తానన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే, డీసీసీ ప్రెసిడెంట్​పొదెం వీరయ్యతో పాటు ఓయూ జేఏసీ కన్వీనర్​ గడ్డం శ్రీరామ్​ టూరిజం హోటల్​లో బస చేసిన చంద్రబాబును కలిశారు. ఐదు పంచాయతీలైన పురుషోత్తపట్నం, ఎటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకులపాడులను తిరిగి తెలంగాణలో కలిపేందుకు కృషి చేయాలని కోరారు.