సింగరేణిలో కొత్త బావుల ఏర్పాటుకు కృషి: గడ్డం వంశీకృష్ణ

సింగరేణిలో కొత్త బావుల ఏర్పాటుకు కృషి: గడ్డం వంశీకృష్ణ
  • రూ.20 వేల జీతమొచ్చే ఉద్యోగాలను సైతం బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు అమ్ముకున్నరు
  • పెద్దపల్లి కాంగ్రెస్‌‌‌‌ ఎంపీ క్యాండిడేట్‌‌‌‌ గడ్డం వంశీకృష్ణ
  • సింగరేణి కార్మికుల సమస్యలపై సీఎంతో చర్చించాం
  • చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌‌‌‌ వెంకటస్వామి

కోల్​బెల్ట్/నస్పూర్, వెలుగు :  సింగరేణి సంస్థలో కొత్త బొగ్గు బావులను నెలకొల్పి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పెద్దపల్లి కాంగ్రెస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ గడ్డం వంశీకృష్ణ హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌‌‌‌ సింగరేణి ఏరియాలోని ఎస్సార్పీ-3, ఆర్కే-6, ఆర్కే-5 బొగ్గు గనులపై ఐఎన్‌‌‌‌టీయూసీ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం గేట్‌‌‌‌ మీటింగ్‌‌‌‌ నిర్వహించారు. సమావేశానికి ఎంపీ క్యాండిడేట్‌‌‌‌ వంశీకృష్ణతో పాటు చెన్నూరు, మంచిర్యాల ఎమ్మెల్యేలు వివేక్​వెంకటస్వామి, కొక్కిరాల ప్రేమ్‌‌‌‌సాగర్‌‌‌‌రావు, వంశీకృష్ణ, కార్మిక సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రాన్ని పదేండ్లు పాలించిన కేసీఆర్​అవినీతి, అక్రమాలతో తన కుటుంబ ఆస్తులను పెంచుకోవడం తప్ప.. సింగరేణి కార్మికులు, ప్రజల కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌‌‌‌ చేశారు. సింగరేణి కార్మికుల క్వార్టర్లు కూడా బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు, కార్యకర్తలే అక్రమించుకున్నారని ఆరోపించారు. అల్యూమినియం కంపెనీ, హిందుస్థాన్‌‌‌‌ జింక్​కార్పొరేషన్‌‌‌‌, ఇండేన్‌‌‌‌ పెట్రోలియం కార్పొరేషన్‌‌‌‌ వంటి ప్రభుత్వ సంస్థలను మోదీ ఆదానీ, అంబానీకి అమ్మితే, సింగరేణిని కేసీఆర్‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌ సంస్థలకు అమ్ముకున్నారని ఆరోపించారు. సింగరేణి కార్మికులకు ఇన్‌‌‌‌కంట్యాక్స్‌‌‌‌ మినహాయింపు, సొంతింటి కల నేరవేర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సింగరేణి సంస్థ నష్టాల్లో ఉంటే రూ.450 కోట్ల రుణం ఇప్పించి కంపెనీతో పాటు లక్ష ఉద్యోగాలు కాపాడిన ఘనత కాకా వెంకటస్వామికే దక్కుతుందన్నారు. రూ.10 వేల కోట్ల రుణమాఫీ చేయించి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని వివేక్‌‌‌‌ వెంకటస్వామి రీ ఓపెన్‌‌‌‌ చేయించారని గుర్తుచేశారు. నెలకు రూ.20 వేల జీతం వచ్చే ఉద్యోగాలను కూడా బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు రూ.20 లక్షల వరకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ నిరుద్యోగులను మోసం చేశారన్నారు. తాను సొంతంగా కంపెనీ పెట్టి 500 మందికి ఉద్యోగాలు ఇచ్చానని, అందులో సింగరేణి కార్మికుల పిల్లలే ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు.

ఎలక్టోరల్‌‌‌‌ బాండ్ల రూపంలో లంచాలు తీసుకున్నయ్‌‌‌‌ : ఎమ్మెల్యే వివేక్‌‌‌‌

బీజేపీ, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీలు ఎలక్టోరల్‌‌‌‌ బాండ్ల రూపంలో లంచాలు తీసుకున్నాయని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌‌‌‌ వెంకటస్వామి ఆరోపించారు. బీజేపీ రూ.9 వేల కోట్లు, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ రూ.550 కోట్ల విలువైన బాండ్స్‌‌‌‌ పొందాయన్నారు. ప్రతి ఒక్కరి అకౌంట్‌‌‌‌లో రూ.15 లక్షలు జమ చేస్తామన్న మోదీ ఆ హామీని మరిచి, ఆదానీ, అంబానీకి మాత్రం రూ.16 లక్షల కోట్ల రుణమాఫీ చేశారని ఆరోపించారు. రూ. 30 వేల కోట్ల అవినీతి చేసి విదేశాల్లో దాక్కున్న విజయ్‌‌‌‌ మాల్యా, నీరవ్‌‌‌‌ మోదీ, చాక్స్‌‌‌‌ మోదీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. తనకు నచ్చని వారిపై ఈడీతో దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగులు బడ్జెట్‌‌‌‌తో ఏర్పడిన తెలంగాణను కేసీఆర్‌‌‌‌ రూ. 7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. అలాగే రూ.80 లక్షల కోట్లు ఉన్న దేశ అప్పును మోడీ రూ.155 లక్షల కోట్లకు పెంచారన్నారు. సింగరేణి కార్మికుల సొంతింటి కల, ఇన్‌‌‌‌కం ట్యాక్స్‌‌‌‌, కాంట్రాక్ట్‌‌‌‌ కార్మికుల వేతనాల పెంపుపై ఇటీవల సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి, భట్టి విక్రమార్క, సింగరేణి సీఎండీ బలరాంనాయక్‌‌‌‌తో చర్చించినట్లు తెలిపారు. సింగరేణి కార్మికులు 12 నెలల కష్టపడితే కేవలం 9 నెలల జీతం మాత్రమే తీసుకుంటున్నారని, మిగతాదంతా ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ కింద కోల్పోతున్నారని ఇటీవల సీఎం దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ మినహాయింపు, కోల్‌‌‌‌ ఇండియా మాదిరి పెర్క్స్‌‌‌‌పై పన్నును సింగరేణి యాజమాన్యమే భరించాలని కోరామన్నారు. 

ఆఫీసర్లు, యూనియన్లతో మాట్లాడి కార్మికులను న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు చెప్పారు. సింగరేణిలో గతంలో 62 వేల మంది ఉద్యోగులు ఉంటే పదేండ్ల బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పాలనలో 39వేలకు తగ్గారన్నారు. 23 వేల మంది ఉద్యోగులను తొలగించినప్పటికీ మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్‌‌‌‌ ఏ రోజూ పట్టించుకోలేదన్నారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను ప్రజలు నమ్మడం లేదన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌‌‌‌ సాగర్‌‌‌‌రావు మాట్లాడుతూ పెద్దపల్లి కాంగ్రెస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ గడ్డం వంశీకృష్ణ తెలివైనవాడని, సింగరేణి కార్మికులకు న్యాయం చేయగల సత్తా ఉన్నవాడని కొనియాడారు. సింగరేణిని బీజేపీ సర్కార్‌‌‌‌ ప్రైవేట్​పరం చేసేందుకు కుట్ర చేస్తోందని ఏఐటీయూసీ స్టేట్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ వాసిరెడ్డి సీతారామయ్య,  సెక్రటరీ జనరల్‌‌‌‌ జనక్‌‌‌‌ ప్రసాద్‌‌‌‌ మండిపడ్డారు.