గుడ్డుకు మద్దతు ధర

గుడ్డుకు మద్దతు ధర

పౌల్ట్రీ రైతుల డిమాండ్​.. ఎక్స్​పో ప్రారంభించిన మంత్రి తలసాని

హైదరాబాద్‌‌,  వెలుగుఆసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఎగ్జిబిషన్.. ‘‘పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌‌పో”13వ ఎడిషన్ బుధవారం హైదరాబాద్​లోని హైటెక్స్​లో షురూ అయింది. రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​ ఎక్స్​పోను ప్రారంభించారు. ఈనెల 29 వరకు కొనసాగనున్న ఎక్స్​పోలో 75 దేశాలకు చెందిన 375 కంపెనీలు, 1500 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు.

కోళ్ల ఆరోగ్యం, పౌష్టికాహారం, బ్రీడింగ్‌‌‌‌, దాణా తయారీకి సంబంధించిన అత్యాధునిక యంత్రాలను ప్రదర్శనకు ఉంచారు. ఎక్స్​పోకు సుమారు 40 వేల మంది విజిటర్స్ వస్తారని అంచనా.  ప్రారంభోత్సవంలో మంత్రి తలసాని మాట్లాడుతూ.. పౌల్ట్రీ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని  తెలిపారు. అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయని, పౌల్ట్రీ ఫారాలు కరెంట్​, దాణాపై రాయితీ ఇస్తున్నామన్నారు. పౌల్ట్రీ రైతుల నుంచి సేకరించిన గుడ్లనే స్కూళ్లు, హాస్టళ్లకు సరఫరాచేస్తున్నట్లు చెప్పారు. పౌల్ట్రీ రైతులు ఎదుర్కొంటున్న నష్టాలపై అధ్యయనం చేసి, పరిష్కారాలు చూపడం కోసం సీఎం కేసీఆర్.. కేబినెట్​ సబ్​ కమిటీని ఏర్పాటుచేశారని, డిసెంబర్​ 2న ఆ కమిటీ సమావేశం కానుందన్నారు.

గుడ్డుకు మద్దతు ధర కల్పించండి

పౌల్ట్రీని వ్యవసాయం అనుబంధ సంస్థగా గుర్తించి, కోడి గుడ్డుకు మద్దతు ధర ప్రకటించాలని రాష్ట్ర పౌల్ట్రీ ఫెడరేషన్‌‌‌‌ అధ్యక్షులు ఎర్రబెల్లి ప్రదీప్‌‌‌‌రావు విజ్ఞప్తి చేశారు. పౌల్ట్రీ ఫారాలన్నింటికీ ఒకే స్లాబ్​ రేటుతో కరెంటు సరఫరా చేయాలన్నారు. తమిళనాడుకు చెందిన ప్రముఖ పౌల్ట్రీ వ్యాపారవేత్త, లోక్​సభ ఎంపీ ఏకేపీ చినరాజ్​ మాట్లాడుతూ.. అమెరికా నుంచి 30 శాతం చికెన్‌‌‌‌లెగ్స్‌‌‌‌ దిగుమతి చేసుకోవాలన్న కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించామని, దీంతో కేంద్రం దీనిపై పునరాలోచనలో పడిందని చెప్పారు. గుడ్ల ధరలపై నెక్​ నియంత్రణను తొలగించేందుకు కృషిచేస్తున్నామన్నారు. పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులుగా తనతోపాటు చేవెళ్ల ఎంపీ రంజిత్​ రెడ్డి కూడా లోక్​సభలో మాట్లాడుతామని చినరాజ్​ అన్నారు. పౌల్ట్రీ ఇండియా ఎక్స్​పో ప్రారంభోత్సవ కార్యక్రమలో ఇండియన్‌‌‌‌ పౌల్ట్రీ ఎక్విప్‌‌‌‌మెంట్‌‌‌‌ మాన్యుఫాక్చరర్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ అధ్యక్షుడు చక్రధర్‌‌‌‌రావు,  రాష్ట్ర పశుసంవర్థకశాఖ డైరెక్టర్‌‌‌‌ డాక్టర్‌‌‌‌ వి.లక్ష్మారెడ్డి, నేషనల్‌‌‌‌ ఎగ్‌‌‌‌ కో-ఆర్డినేషన్‌‌‌‌ కమిటీ ప్రతినిధి ఎంబీ దేశాయ్, పౌల్ట్రీ ఇండియా ఎగ్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ కమిటీ సభ్యులు డి.రాంరెడ్డి, ఎస్‌‌‌‌వీ భవే, పౌల్ట్రీ ఫెడరేషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా ప్రతినిధి రమేష్‌‌‌‌ చక్రధర్‌‌‌‌ కత్రీ, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పౌల్ట్రీ రైతులు పాల్గొన్నారు.

మంత్రికి నిరసన సెగ

పౌల్ట్రీ ఇండియా ఎక్స్​పో ప్రారంభోత్సవంలో మంత్రి తలసానికి  పౌల్ట్రీ రైతుల నుంచి నిరసన సెగ ఎదురైంది. నల్ల దుస్తులు ధరించి, నోటికి, తలకు నల్ల రిబ్బన్లు కట్టుకున్న పౌల్ట్రీ రైతులు.. మంత్రి ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కోడిగుడ్లకు సరైన ధర లేకపోవడం, పౌల్ట్రీ షెడ్డులకు ట్యాక్స్ విధింపు తదితర సమస్యలను ప్రస్తావిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గుడ్డుకు సరైన ధర లేక రెండేండ్లుగా నష్టపోతున్నామని, మెడిసిన్​ కంపెనీల చేతుల్లో లేయర్‌‌‌‌ రైతులు మోసపోతున్నారని, లేయర్‌‌‌‌ కోళ్ల రైతులకు ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ బ్రీడర్ కంపెనీలు ఎత్తుకెళ్లాయని రైతులు ఆరోపించారు. రాష్ట్ర పరిధిలో ఎగ్‌‌‌‌ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు. నిరసనకు దిగిన రైతులపై మంత్రి తలసాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల గురించి ప్రస్తావించడానికి ఇది సరైన వేదిక కాదని, విదేశీ కంపెనీలు పాల్గొన్న కార్యక్రమంలో ఆందోళన చేస్తే ఇక్కడి పౌల్ట్రీ రంగానికి చెడ్డపేరు వస్తుందని రైతులపై మండిపడ్డారు. గుడ్లకు మద్దతు ధరపై కేబినెట్​ సబ్​కమిటీలో చర్చిస్తామని, పౌల్ట్రీలకు హౌజ్‌‌‌‌ట్యాక్స్‌‌‌‌ విధింపుపై సీఎం కేసీఆర్​తో మాట్లాడుతానని మంత్రి తలసాని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తల కోసం