Akhanda 2 OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన బాలయ్య ‘అఖండ 2: తాండవం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Akhanda 2 OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన బాలయ్య ‘అఖండ 2: తాండవం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ చిత్రం 'అఖండ 2: తాండవం'. వీరిద్దరి కలయికతో వచ్చిన ‘అఖండ’ ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. దానికి కొనసాగింపుగా తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2: తాండవం’  గత ఏడాది డిసెంబర్ 12న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే బాక్సీఫీస్ వద్ద మిశ్రమ స్పందనతో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ వేదికగా తన ప్రతాపాన్ని చూపేందుకు సిద్ధమైంది.

నెట్‌ఫ్లిక్స్‌లో ‘తాండవం’ షురూ!

థియేటర్లలో వచ్చి నెల రోజులు కూడా కాకముందే ‘అఖండ 2: తాండవం’  ఓటీటీలోకి వచ్చేసింది. సంక్రాంతి కానుకగా సరిగ్గా జనవరి 9 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులోకి రావడంతో పాన్ ఇండియా ప్రేక్షకులు ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్లలో మిస్ అయిన వారు, మరోసారి బాలయ్య మాస్ యాక్షన్‌ను ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది పండగ లాంటి వార్తే మరి.

కథా నేపథ్యం

తొలి భాగం ముగిసిన చోటు నుంచే ఈ సీక్వెల్ ప్రారంభమవుతుంది. ఈసారి బోయపాటి కథను మరింత భారీ స్థాయిలో, దేశ భద్రత , సనాతన ధర్మ పరిరక్షణ చుట్టూ అల్లారు.  కుంభమేళా, టిబెట్ సరిహద్దుల నేపథ్యంలో సాగే ఈ కథలో భారతదేశంపై శత్రుదేశాలు చేసే ‘బయోలాజికల్ వార్’ (జీవాయుధ దాడి) ప్రధానాంశంగా తెరకెక్కించారు. ఇస్రో శాస్త్రవేత్తలను రక్షించడానికి, దేశంపై జరుగుతున్న కుట్రలను ఛేదించడానికి 'రుద్ర సికిందర్ అఘోరా'గా బాలకృష్ణ చేసే యుద్ధమే ఈ ‘తాండవం’. బాలయ్య మరోసారి తనదైన శైలిలో రెండు విభిన్న పాత్రల్లో మెప్పించారు. ముఖ్యంగా అఘోరా పాత్రలో ఆయన పలికించిన డైలాగులు, బాడీ లాంగ్వేజ్ నెక్స్ట్ లెవల్‌లో ఉన్నాయి.

►ALSO READ | పదే పదే ఎందుకు పెంచుతున్నారు..? టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం

ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో ప్రధాన ఆకర్షణ. థియేటర్లలో ప్రతి యాక్షన్ సీన్‌ను తమన్ మ్యూజిక్ ఎలివేట్ చేసింది. నటుడు ఆది పినిశెట్టి ఈ సినిమాలో శక్తివంతమైన విలన్ పాత్రలో బాలయ్యను ఢీకొట్టారు. బాలయ్య సరసన సంయుక్త మీనన్ కథలో కీలకమైన పాత్రలో ఒదిగిపోయారు. ‘బజరంగీ భాయ్‌జాన్’ ఫేమ్ హర్షాలీ మల్హోత్రా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించి మెప్పించింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

థియేటర్ మిస్.. ఓటీటీలో హిట్టేనా?

థియేటర్లలో విడుదలైన సమయంలో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. కథలో కొన్ని లాజిక్స్, అతిగా అనిపించే యాక్షన్ సీన్ల వల్ల బాక్సాఫీస్ వద్ద అశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. అయితే, ఓటీటీలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇంటి వద్ద కూర్చుని చూసే మాస్ ప్రేక్షకులకు, ముఖ్యంగా పండగ సెలవుల్లో బాలయ్య యాక్షన్ సీక్వెన్స్‌లు ఫుల్ మీల్స్‌లా అనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో బాలయ్య డైలాగులు, అఘోరా గెటప్ క్లిప్స్ మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. థియేటర్లలో కొంచెం నెమ్మదించినా, నెట్‌ఫ్లిక్స్ వేదికగా ‘అఖండ 2: తాండవం’ సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా దూసుకుపోతోందంటున్నారు అభిమానులు. బాలయ్య-బోయపాటిల నాలుగో సినిమాగా వచ్చిన ఈ చిత్రం, ఓటీటీ వ్యూయర్‌షిప్‌లో 'తాండవం' చేస్తోందనడంలో  లేదో చూడాలి.