పదే పదే ఎందుకు పెంచుతున్నారు..? టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం

పదే పదే ఎందుకు పెంచుతున్నారు..? టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్: సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. టికెట్ రేట్లు పెంచబోమని సినిమాటోగ్రఫీ మంత్రి కూడా చెప్పారని.. అయినా టికెట్ల రేట్ల పెంపునకు అనుమతిస్తూ ఎందుకు మెమోలు ఇస్తున్నారని ప్రశ్నించింది. తెలివిగా మెమోలు జారీ చేస్తున్నారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు మీ ఆలోచన మారడం లేదని అసహనం వ్యక్తం చేసింది. 

ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ మూవీ ప్రీమియర్ షో, టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజాసాబ్ మూవీ టికెట్ ధరల పెంపును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. శుక్రవారం (జనవరి 9) ఈ పిటిషన్‏పై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ తరుఫున న్యాయవాది విజయ్ గోపాల్ వాదిస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా టికెట్ల ధరల పెంపునకు అనుమతిస్తున్నారని అన్నారు. హోంశాఖ కార్యదర్శికి టికెట్ రేట్ల పెంపు మెమో జారీ చేసే అధికారం లేదన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, హైదరాబాద్‎లో సీపీ మాత్రమే టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. 

మెమో జారీ చేసిన అధికారికి రూ.5లక్షల జరిమానా విధించాలని కోరారు. అలాగే.. సినిమాటోగ్రఫీ మంత్రి గతంలో తనకు తెలీకుండానే టికెట్ రేట్ పెంపు మెమోలు ఇచ్చారన్న స్టేట్మెంట్‎ను కోర్ట్ దృష్టికి తీసుకొచ్చారు అడ్వకేట్ విజయ్ గోపాల్. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  టికెట్ రేట్ల పెంపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే సినిమా టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వమని సినిమాటోగ్రఫీ మంత్రి కూడా చెప్పారని.. మెమో ఇచ్చే అధికారికి నిబంధనలు తెలియవా అని ప్రశ్నించింది. టికెట్ రేట్ల మెమో గురించి విచారణ జరగటం ఇది మొదటి సారి కాదని.. ఎన్ని సార్లు చెప్పినా ఎందుకు మీ ఆలోచన తీరు మారడం లేదని అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ తరుఫున జీపీ వాదిస్తూ.. టికెట్ ధర పెంపు వల్ల ప్రైవేట్ వ్యక్తి మాత్రమే ఇబ్బందికి గురవుతారని.. ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదు ఒక రిట్ పిటిషన్ మాత్రమేనని అన్నారు. 

అలాగే సినిమా యూనిట్ అడిగిన అన్ని వెసులుబాట్లకు మేము ఒప్పుకోలేదని.. కొన్నిటికి మాత్రమే మేము ఓకే చెప్పామని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. టికెట్ రేట్ల పెంపుతో వచ్చిన లాభాల్లో 20 శాతం ప్రాఫిట్ సినీ కార్మికులకు ఇవ్వాలనే డిమాండ్ పెట్టామని.. తద్వారా సినీ కార్మికులు దీని ద్వారా లబ్ధి పొందుతారని చెప్పారు. కేసు విచారణలో సినీ కార్మికుల అసోసియేషన్‎ వాదన వినకుంటే ఎలా అన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు కలగజేసుకుని 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్ మొత్తం ఒకే టికెట్ ధర ఉంటుండేదని.. మేము కూడా సినిమాలకు వెళ్ళాం మాకు టికెట్ ధరలు తెలుసని పేర్కొంది.