గుడ్ న్యూస్: ప్రభుత్వ ఉద్యోగులకు రూ. కోటి బీమా!

గుడ్ న్యూస్: ప్రభుత్వ ఉద్యోగులకు రూ. కోటి బీమా!
  • బ్యాంకర్లతో ముగిసిన చర్చలు.. త్వరలోనే అమల్లోకి
  • మొత్తం 5.14 లక్షల ఉద్యోగుల కుటుంబాలకు లబ్ధి
  • ఇప్పటికే సింగరేణి, విద్యుత్ సిబ్బందికి అమలు
  • ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయమన్న డిప్యూటీ సీఎం భట్టి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు ఉద్యోగులందరికీ ప్రభుత్వం రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అందుబాటులోకి తెస్తున్నది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తయిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకర్లతో జరిపిన సంప్రదింపులు ముగిశాయని.. త్వరలోనే ఈ విధానం అమల్లోకి వస్తుందని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 5.14 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందని భట్టి విక్రమార్క తెలిపారు. విధి నిర్వహణలో అనుకోని ప్రమాదాలు జరిగితే ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ భారీ బీమా కవరేజీని కల్పిస్తున్నట్టు వెల్లడించారు. ప్రమాద బీమా విషయంలో ప్రభుత్వం ఇప్పటికే చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని డిప్యూటీ సీఎం తెలిపారు. సింగరేణి, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌కో, జెన్‌‌‌‌‌‌‌‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఉద్యోగులందరికీ ఇప్పటికే కోటి రూపాయలకు పైగా ప్రమాద బీమాను అమల్లోకి తెచ్చామని తెలిపారు.

 ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను సైతం ప్రతి నెలా క్రమం తప్పకుండా దశలవారీగా నిధులు విడుదల చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ చేరవేసే ఉద్యోగులను ప్రభుత్వం తమ సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తోందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం చొరవతో సింగరేణిలో 38 వేల మంది రెగ్యులర్ ఉద్యోగులకు ఈ బీమా అందుతోంది. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 71,387 మంది ఉద్యోగులకు కూడా దీనిని వర్తింపజేశారు. ఇదే తరహాలో ఇప్పుడు ఇతర సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రూ. 1.02 కోట్ల బీమాను విస్తరిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి వివరించారు.