రష్యాలో రోడ్డు ఊడ్చేవాళ్లకు కూడా లక్ష రూపాయల జీతం.. పోదాం అన్నయ్య రష్యా పోదాం..

రష్యాలో రోడ్డు ఊడ్చేవాళ్లకు కూడా లక్ష రూపాయల జీతం.. పోదాం అన్నయ్య రష్యా పోదాం..

ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. దిగ్గజ ఐటీ కంపెనీల్లో లే-ఆఫ్స్, తగ్గిన రిక్రూట్మెంట్స్ కారణంగా ఎంతో మంది నిపుణులు తమ కెరీర్ మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో రష్యాలో ఉంటున్న కొందరు భారతీయులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ వంటి టాప్ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేసిన ఒక ఇండియన్ టెక్కీ ఇప్పుడు రష్యా వీధుల్లో చెత్త ఊడ్చుకుంటూ నెలకు లక్ష రూపాయలకు పైగా సంపాదిస్తుండటం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

భారతదేశానికి చెందిన 26 ఏళ్ల ముఖేష్ మండల్ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అత్యాధునిక ఏఐ టూల్స్, చాట్‌బాట్స్, జీపీటీ ప్లాట్‌ఫారమ్‌లపై అతనికి మంచి పట్టు ఉంది. అయితే ప్రస్తుతం అతను సెయింట్ పీటర్స్‌బర్గ్ నగర వీధుల్లో చెత్త ఊడ్చే కార్మికుడిగా పనిచేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖేష్‌తో పాటు మరో 16 మంది భారతీయులు కూడా అదే నగరంలో రోడ్లను శుభ్రం చేసే పని చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. రష్యాలో ఉన్న కార్మికుల కొరతను తీర్చడానికి చేపట్టిన పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా వీరంతా అక్కడకు వెళ్లారని తెలుస్తోంది.

చూసేవాళ్లకు చెత్త ఊడ్చే పనిలా కనిపిస్తున్నప్పటికీ.. ముఖేష్ నెలకు దాదాపు లక్ష రూబుల్స్ సంపాదిస్తున్నాడు. భారత కరెన్సీ ప్రకారం ముఖేష్ సంపాదన రూ.లక్షా 10వేలు. దీనికి అదనంగా కంపెనీనే వారికి స్టే, ఫుడ్, ట్రాన్స్ పోర్ట్, సేఫ్టీ దుస్తులను ఉచితంగా అందిస్తోంది. భారతీయ సంస్కృతిని గౌరవిస్తూ వారికి బీఫ్ లేని ఆహారాన్ని కూడా అందిస్తోంది వారు పనిచేస్తున్న కంపెనీ. ఇండియా నుంచి వెళ్లి పనిచేస్తున్న వీరిలో కేవలం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే కాకుండా ఆర్కిటెక్టులు, డ్రైవర్లు, రైతులు, ఈవెంట్ ఆర్గనైజర్లు కూడా ఉన్నారట. వారంతా తమ ఇష్టపూర్వకమే ఈ పనుల్లో చేరడం గమనార్హం.

ఒక భారతీయుడిగా తనకు పని ముఖ్యం తప్ప, అది ఏ పని అనేది ముఖ్యం కాదంటున్నాడు ముఖేష్ మండల్. చేసే పనిని దైవంగా భావిస్తున్నట్లు చెప్పాడు. వీధులు ఊడ్చడమైనా, మరుగుదొడ్లు కడగడమైనా తన బాధ్యతగా భావించి మనస్ఫూర్తిగా చేస్తున్నట్లు తన పని గురించి సంతోషంగా ఉన్నాడు. ప్రస్తుతం రష్యాలో ఉండి కొంత డబ్బు సంపాదించి, ఏడాది తర్వాత తిరిగి ఇండియా తిరిగి రావాలన్నదే తన లక్ష్యమని చెప్పాడు. టెక్ రంగంలో ఒడిదుడుకులు ఎదురైనా, కుంగిపోకుండా ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆర్థికంగా నిలబడడం నేటి యువతకు ఒక కొత్త పాఠంలా ముఖేష్ మాటలు ఉన్నాయి.