నేపాల్ ప్రభుత్వం తన ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతను పెంచే దిశగా సంచలన నిర్ణయం తీసుకుంది. జనవరి 15 నుంచి డబ్బు వినియోగం గురించి కొత్త రూల్స్ అమలులోకి తీసుకొస్తోంది నేపాల్. వస్తుసేవల క్రయవిక్రయాలకు సంబంధించి నగదు లావాదేవీలపై పరిమితిని విధించింది. ఇకపై నేపాల్‌లో ఏ వ్యక్తి అయినా.. లేదా సంస్థ అయినా ఒక ట్రాన్సాక్షన్ లో 5 లక్షల నేపాలీ రూపాయలకు మించి క్యాష్ నేరుగా చెల్లించడానికి వీలుండదు. దీనికంటే పెద్ద మెుత్తంలో చెల్లింపులు చేయాలంటే తప్పనిసరిగా బ్యాంకింగ్ వ్యవస్థ లేదా డిజిటల్ పేమెంట్ వ్యవస్థలను ప్రజలు వాడాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
నేపాల్ ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ ఒత్తిడితో పాటు అంతర్గత ఆర్థిక భద్రత సమస్యలే. ప్రస్తుతం నేపాల్ అంతర్జాతీయ మనీ లాండరింగ్ నిరోధక సంస్థ (FATF) గ్రే లిస్ట్లో ఉంది. దేశంలో ఆర్థిక కార్యకలాపాల్లో మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి 'మనీ లాండరింగ్ నిరోధక చట్టం, 2008' కింద ఈ నగదు పరిమితిని విధించారు. గతంలో ఈ నగదు లావాదేవీల పరిమితి 10 లక్షల రూపాయలుగా ఉండగా.. ప్రస్తుతం దానిని సగానికి తగ్గిచటం జరిగింది.
నేపాల్ సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. కంపెనీలు, సంస్థలు లేదా కార్యాలయాల పేరుతో జారీ అయ్యే చెక్కులు తప్పనిసరిగా 'అకౌంట్ పేయీ' మాత్రమే అయి ఉండాలి. అంటే ఆ నగదు నేరుగా సంబంధిత వ్యక్తి లేదా సంస్థ ఖాతాలోకే జమ అవుతుంది. అయితే ఈ రూల్ నుంచి ప్రభుత్వం కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేయడం, తీసుకున్న రుణాల అసలు వడ్డీ చెల్లించడం, ఆర్థిక సంస్థల మధ్య జరిగే అంతర్గత లావాదేవీలకు ఈ 5 లక్షల పరిమితి వర్తించదని నేపాల్ వెల్లడించింది.
అంతేకాకుండా సరైన కారణంతో పాటు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలు చూపిస్తే దేశంలో భారీగా నగదును తీసుకెళ్లేవారికి ఎటువంటి ఆంక్షలు ఉండవు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా డిపాజిటర్ పరిమితికి మించి నగదు కావాలని దరఖాస్తు చేసుకుంటే.. బ్యాంకులు ఆ కారణం సరైనదిగా భావిస్తే డబ్బు ఇవ్వొచ్చు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు నేపాల్ వేగంగా అడుగులు వేస్తోందనడానికి తాజా పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి. క్యాష్ వినియోగాన్ని తగ్గించి.. ప్రతి పైసా లెక్కలోకి వచ్చేలా చేయడం ద్వారా దేశ ఆర్థిక పురోగతికి బాటలు వేయాలని నేపాల్ ప్రభుత్వం భావిస్తోంది.
