- పబ్లిక్కు రానున్న ఏడు రైల్వే కంపెనీలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా భారీగా నిధులు సేకరించడానికి కేంద్రం సిద్ధమైంది. దీని కోసం నీతి ఆయోగ్ ఒక ప్లాన్ను తయారు చేసింది. 2030 నాటికి ఐపీఓల ద్వారా రూ.1.79 లక్షల కోట్లు సమీకరిస్తారు.
ఈ ప్రతిపాదనలో భాగంగా వచ్చే నాలుగేళ్లలో ఆస్తుల అమ్మకం ద్వారా 183.7 బిలియన్ డాలర్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా రైల్వే, విద్యుత్, పెట్రోలియం, సహజ వాయువు, విమానయాన, బొగ్గు రంగాల్లోని ప్రభుత్వ కంపెనీల ఐపీఓలు రానున్నాయి. గతంలో మొదటి విడత ఆస్తుల అమ్మకం ద్వారా 2025 నాటికి రూ.5.3 లక్షల కోట్లు సేకరించారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏడు రైల్వే కంపెనీల ఐపీఓల ద్వారా రూ.17 వేలు కోట్లు సేకరించవచ్చని అంచనా వేస్తున్నారు.
కోల్ ఇండియా, ఎన్ఎల్సీ ఇండియా అనుబంధ సంస్థల లిస్టింగ్ ద్వారా రూ.48.3 వేలు కోట్లు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గెయిల్ గ్యాస్ వంటి అనుబంధ సంస్థలను కూడా 2027–-28 ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ నిధులను తిరిగి అదే సంస్థల్లో పెట్టుబడిగా పెట్టడం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గుతుంది.
