Raja Saab Ticket Price Issue: ‘ది రాజా సాబ్’ నిర్మాతలకు హైకోర్ట్‏ షాక్.. టికెట్ రేట్ల పెంపు మెమో సస్పెండ్!

Raja Saab Ticket Price Issue: ‘ది రాజా సాబ్’ నిర్మాతలకు హైకోర్ట్‏ షాక్.. టికెట్ రేట్ల పెంపు మెమో సస్పెండ్!

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు పండుగ చేసుకుంటున్న వేళ ‘ది రాజా సాబ్’ చిత్ర బృందానికి తెలంగాణ హైకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. భారీ బడ్జెట్ చిత్రాలకు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను న్యాయస్థానం సస్పెండ్ చేసింది. పాత ధరలకే టికెట్లను అమ్మాలని ఆదేశించింది. దీంతో సినిమా నిర్మాతలకు భారీ షాక్ తగిలినట్లయింది.
 
ప్రభుత్వ మెమోపై హైకోర్టు ఆగ్రహం

‘ది రాజా సాబ్’ సినిమా టికెట్ ధరల పెంపును సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త, న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది.  ఈ సందర్భంగా నిబంధనల ప్రకారం టికెట్ ధరల పెంపు లేదా బెనిఫిట్ షోల అనుమతిపై నిర్ణయం తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు లేదా హైదరాబాద్‌లో పోలీస్ కమిషనర్‌కు మాత్రమే ఉంటుందని, హోంశాఖ కార్యదర్శికి ఆ అధికారం లేదని పిటిషనర్ వాదించారు. మెమో జారీ చేసిన అధికారికి 5 లక్షల జరిమానా విధించాలని విజయ్ గోపాల్ కోర్టును కోరారు. 

కోర్టు కీలక వ్యాఖ్యలు..

ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా టికెట్ ధరలు ఎలా పెంచుతారని ధర్మాసనం ప్రభుత్వాన్ని నిలదీసింది.  టికెట్ రేట్లు పెంచుతూ మెమోలు జారీ చేసే అధికారులకు కనీస నిబంధనలు తెలియవా? అని కోర్టు తీవ్రంగా మండిపడింది. గతంలో సినిమాటోగ్రఫీ మంత్రి స్వయంగా టికెట్ రేట్లు పెంచబోము అని చెప్పిన విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. మంత్రి ప్రకటనకు భిన్నంగా హోంశాఖ అధికారులు మెమోలు ఎలా ఇస్తారని ప్రశ్నించింది.

ప్రభుత్వ వాదన ఏంటి?

ప్రభుత్వం తరపున జీపీ వాదిస్తూ.. టికెట్ ధరల పెంపు వల్ల వచ్చే లాభాల్లో 20 శాతం సినీ కార్మికుల సంక్షేమానికి కేటాయించాలని నిబంధన పెట్టామని, ఇది కార్మికులకు మేలు చేస్తుందని కోర్టుకు వివరించారు. అయితే, దీనిపై కోర్టు స్పందిస్తూ.. "20 ఏళ్ల క్రితం హైదరాబాద్ మొత్తం ఒకే టికెట్ ధర ఉండేది. మేము కూడా సినిమాలకు వెళ్తాము, మాకు టికెట్ ధరలు తెలుసు అని వ్యాఖ్యానించింది. పదే పదే రేట్లు పెంచుతూ సామాన్యుడిపై భారం వేయడాన్ని  కోర్టు తప్పుబట్టింది.

►ALSO READ \ జన నాయగన్ మూవీకి హైకోర్టులో బిగ్ షాక్.. సంక్రాంతి రేసు నుంచి దళపతి సినిమా పూర్తిగా ఔట్..!

పాత ధరలకే టికెట్లు!

హైకోర్టు ఆదేశాల ప్రకారం, ఇప్పుడు ‘ది రాజా సాబ్’ టికెట్లను పాత ధరలకే అమ్మాల్సి ఉంటుంది. పెంచిన ధరలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన మెమోను కొట్టివేయడంతో, థియేటర్ల వద్ద పెంచిన రేట్లతో టికెట్లు అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు అయింది.  సంక్రాంతి సీజన్‌లో భారీ వసూళ్లు ఆశించిన నిర్మాతలకు, ఈ కోర్టు తీర్పు కొంత నిరాశ కలిగించింది.

బాక్సాఫీస్ వద్ద 'ది రాజా సాబ్'

ప్రభాస్ మారుతి కాంబినేషన్లో వచ్చిన 'ది రాజా సాబ్' చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇది ఒక రొమాంటిక్ హారర్ కామెడీ. ప్రభాస్ తన కెరీర్‌లో తొలిసారి ఈ తరహా పాత్రలో నటిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ కథానాయికలుగా నటించగా.. సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై  భారీ బడ్జెట్‌తో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. తమన్ అందించిన సంగీతం హైలెట్ గా నిలిచింది.