ముంబై: ముంబైలో BMC (బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్) ఎన్నికల సందడి మొదలైంది. వార్డ్ నెంబర్.226 నుంచి ఈ ఎన్నికల బరిలో నిలిచిన మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ తమ్ముడు మకరంద్ నర్వేకర్ తాజాగా వార్తల్లో నిలిచారు.
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల్లో పోటీ చేస్తున్న అత్యంత సంపన్న అభ్యర్థులలో ఆయన ఒకరు. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్ముడి ఆస్తులు రూ.120 కోట్లకు పైగానే ఉన్నాయి. మకరంద్ నార్వేకర్ ఈ మేరకు తన ఆస్తులు అప్పులకు సంబంధించి అఫిడవిట్ సమర్పించారు.
బీజేపీ టికెట్‌పై మూడోసారి పోటీ చేస్తున్న ఆయన దాఖలు చేసిన 27 పేజీల అఫిడవిట్ ప్రకారం.. ఆయన ఆస్తులు రూ.124.4 కోట్లుగా ప్రకటించారు. వీటిలో.. రూ.32.32 కోట్లు స్థిరాస్తులు. ఆయన ఆస్తులు తొమ్మిదేళ్ల క్రితంతో పోలిస్తే 18 వందల 68 శాతం పెరిగాయి.
ఇక ఆయన అప్పుల విషయానికొస్తే బ్యాంకు లోన్లు, ఇతరత్రా కలిపి రూ.16.68 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని ఆయన తన అఫిడవిట్లలో పేర్కొన్నారు. అతని ఆస్తులలో.. రూ.6 లక్షల 66 వేల 370 బ్యాంకు డిపాజిట్లు, రూ.40.75 లక్షలు, రూ.38.75 లక్షల విలువైన రెండు టయోటా ఫార్చ్యూనర్ సిగ్మా కార్లు సహా మూడు వాహనాలు, రూ.9 లక్షల విలువైన మారుతి గ్రాండ్ విటారా కూడా ఉన్నాయి.
అక్టోబర్ 2022, నవంబర్ 2025 మధ్య, అతను తీర ప్రాంత రాయ్‌గఢ్ జిల్లాలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అలీబాగ్ ప్రాంతంలో 27 ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. జిరాద్‌పాడ, కిహిమ్, ధోకావాడే, సస్వానే, మత్రోలివాడి, మాప్‌గావ్ గ్రామాలలో ఆయనకు వ్యవసాయ భూములు ఉన్నాయి. అదనంగా, దక్షిణ ముంబైలోని కొలాబాలో రూ.7.99 కోట్ల విలువైన ఫ్లాట్, 29 వ్యవసాయ భూములు కూడా ఆయనకు ఉన్నాయని, వాటిలో 27 ఆయన సొంతం కాగా, రెండు ఆయన భార్య రచనా సొంతం అని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ఈ భూములను అక్టోబర్ 2022 మరియు నవంబర్ 2025 మధ్య కొనుగోలు చేశారు, మరియు ఫ్లాట్‌ను అక్టోబర్ 2021లో కొనుగోలు చేశారు. నార్వేకర్ వ్యవసాయ భూమి ప్రస్తుత విలువ దాదాపు రూ.89.91 కోట్లు కాగా, ఆయన భార్య పేరు మీద ఉన్న భూముల విలువ రూ.2.41 కోట్లు అని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 2017 ఎన్నికలలో ఇదే మకరంద్ నర్వేకర్ తన ఆస్తులను రూ.6.3 కోట్లుగా అఫిడవిట్లో ప్రకటించడం గమనార్హం.
