ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ రంగంలో పనిచేసే కోట్లాది మంది ఉద్యోగుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ నిబంధనల్లో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా ప్రావిడెంట్ ఫండ్ జమ చేయడానికి ప్రాతిపదికగా తీసుకునే వేజ్ సీలింగ్ ని పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి. దేశవ్యాప్తంగా జీతాలు పెరుగుతున్న క్రమంలో పాత నిబంధనల వల్ల చాలా మంది ఉద్యోగులు సామాజిక భద్రతా ప్రయోజనాలను కోల్పోతున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సమీక్ష చేపట్టింది. సుమారు పదేళ్లుగా ఈ పరిమితిలో ఎలాంటి మార్పు లేవు.
ప్రస్తుతం అమలులో ఉన్న రూల్స్ ప్రకారం.. ప్రావిడెంట్ ఫండ్‌లో తప్పనిసరిగా చేరడానికి గరిష్ట నెలవారీ వేతన పరిమితి రూ.15వేలుగా ఉంది. అంటే రూ.15వేల కంటే తక్కువ జీతం ఉన్నవారు తప్పనిసరిగా పీఎఫ్ కట్టాలి. అంతకంటే ఎక్కువ జీతం ఉన్నవారు వారి ఈపీఎఫ్ఓ కట్టాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవచ్చు. ఈ పరిమితిని చివరిసారిగా 2014 సెప్టెంబర్‌లో సవరించారు. అయితే గడిచిన పదేళ్లలో జీవన వ్యయం పెరగడమే కాకుండా.. కనీస వేతనాలు కూడా చాలా రాష్ట్రాల్లో రూ.15వేల మార్కును దాటేశాయి.
వేతన పరిమితిని పెంచాలనే ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. గతంలో దీనిని రూ.25వేలకు పెంచాలని ప్రభుత్వం భావించినప్పటికీ.. కంపెనీలపై అదనపు భారం పడుతుందనే ఉద్దేశంతో వాయిదా పడింది. మరోవైపు ఉద్యోగ సంఘాలు ఈ పరిమితిని రూ.30వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇటీవల సుప్రీంకోర్టు ఈ వేతన పరిమితిని నాలుగు నెలల్లోగా సమీక్షించాలని కేంద్ర కార్మిక శాఖను ఆదేశించడంతో ఈ అంశంపై మళ్లీ కదలిక వచ్చింది. కొత్త లేబర్ కోడ్‌ల అమలుకు సిద్ధమవుతున్న తరుణంలో శాలరీపై స్పష్టతనిస్తూ ఈ పరిమితిని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఒకవేళ వేతన పరిమితి పెరిగితే.. లక్షలాది మంది అన్ ఆర్గనైజ్డ్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఈపీఎఫ్ పరిధిలోకి వస్తారు. నెలకు పీఎఫ్ రూపంలో జమ అయ్యే సొమ్ము పెరగడం వల్ల, ఉద్యోగ విరమణ నాటికి వారి చేతికి వచ్చే రిటైర్మెంట్ కార్పస్ కూడా గణనీయంగా పెరుగుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 7 కోట్ల 40 లక్షల మంది చురుకైన కంట్రిబ్యూటర్లు ఉండగా.. మొత్తం 32 కోట్ల ఈపీఎఫ్ ఖాతాలు ఉన్నాయి. ఈ మార్పు ద్వారా కోట్లాది మంది మధ్యతరగతి, అట్టడుగు స్థాయి ఉద్యోగులకు భవిష్యత్తులో ఆర్థిక భరోసా లభించనుందని విశ్లేషకులు అంటున్నారు.
