న్యూఢిల్లీ: ఇండియా నుంచి 2025లో స్మార్ట్‌ఫోన్‌లు అత్యధికంగా ఎగుమతయ్యాయి. విదేశాలకు 30 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2.73 లక్షల కోట్ల) విలువైన మొబైల్ ఫోన్లు ఎగుమతి చేశామని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రపంచానికి స్మార్ట్‌ఫోన్ మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీగా ఇండియా మారుతోందని అన్నారు. ‘‘కిందటేడాది మొత్తం రూ. 5.46 లక్షల కోట్ల (60 బిలియన్ డాలర్ల) విలువైన మొబైల్ ఫోన్లు దేశంలో తయారయ్యాయి. అందులో రూ. 2 లక్షల కోట్ల (22 బిలియన్ డాలర్లు) విలువైనవి 2024–-25లో ఎగుమతయ్యాయి.
2025లో మొత్తం ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు రూ. 4 లక్షల కోట్లు (44 బిలియన్ డాలర్లు) దాటాయి. ఈ ఏడాది నాలుగు సెమీకండక్టర్ ప్లాంట్లు ఉత్పత్తి ప్రారంభిస్తే ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు మరింత పెరుగుతాయని అంచనా”అని ఎక్స్‌లో వైష్టవ్ పోస్ట్ చేశారు. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ఫౌండర్ నీల్ షా మాట్లాడుతూ, చైనాపై అమెరికా టారిఫ్‌లు పెంచడంతో యాపిల్ భారతదేశంలో తయారీని విస్తరించి, ఎగుమతులను రికార్డు స్థాయికి తీసుకెళ్లిందని అన్నారు.
2025లో భారత్‌లో తయారైన ప్రతి నాలుగు స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి ఎగుమతి అయినట్లు అంచనా. యాపిల్, శామ్‌సంగ్, మోటోరోలా వంటి బ్రాండ్లు అమెరికాకు భారీగా ఎగుమతి చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) డేటా ప్రకారం, 2025 డిసెంబర్ క్వార్టర్‌లో యాపిల్ భారత మార్కెట్‌లో 50 లక్షల ఐఫోన్లను సరఫరా చేసి రికార్డు సృష్టించింది.
