కొట్టాలె గట్టిగా.. ఇవాళ(ఫిబ్రవరి 26) జింబాబ్వేతో టీమిండియా కీలక మ్యాచ్‌‌

కొట్టాలె గట్టిగా.. ఇవాళ(ఫిబ్రవరి 26) జింబాబ్వేతో టీమిండియా కీలక మ్యాచ్‌‌
  • భారీ విజయంపై కన్నేసిన సూర్యసేన
  • తుది జట్టులోకి అక్షర్, శాంసన్‌‌!

చెన్నై: నాకౌట్‌‌ రౌండ్‌‌కు ముందే టీ20 వరల్డ్‌‌ కప్ ఉత్కంఠ భరితమైన దశకు చేరుకుంది. డిఫెండింగ్ చాంపియన్‌‌గా బరిలోకి దిగి గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా ఒకే ఒక్క ఓటమితో టోర్నీలో చావోరోవో తేల్చుకునే పరిస్థితిలో నిలిచింది. సెమీఫైనల్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే తప్పక నెగ్గాల్సిన సూపర్‌‌‌‌–8 రౌండ్ మ్యాచ్‌‌లో  గురువారం ఇక్కడి చెపాక్ స్టేడియంలో జరిగే  సంచలనాల జట్టు జింబాబ్వేతో అమీతుమీ తేల్చుకోనుంది.

సౌతాఫ్రికా చేతిలో ఎదురైన ఘోర పరాజయం  తర్వాత ఇండియా నెట్ రన్ రేట్ (–-3.80) దారుణంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ సేనకు జింబాబ్వేపై గెలుపు మాత్రమే సరిపోదు. సెమీస్ రేసులో  ముందంజ వేయాలంటే భారీ ఆధిక్యంతో విజయం సాధించాల్సి ఉంటుంది. 

బ్యాటింగ్‌‌పైనే బెంగ

ఈ టోర్నీలో ఇండియా అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతోంది. ముఖ్యంగా టాపార్డర్ వైఫల్యం జట్టును వేధిస్తోంది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వంటి యంగ్‌‌ ప్లేయర్లు ఆశించిన స్థాయిలో రన్స్ చేయలేకపోతున్నారు.  కెప్టెన్  సూర్యకుమార్ (180 రన్స్)  స్లో బ్యాటింగ్ జట్టుకు ఆశించిన వేగాన్ని ఇవ్వడం లేదు. ఇషాన్ కిషన్ (193 స్ట్రయిక్ రేట్) ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. సఫారీలపైన ఇషాన్ కూడా ఫెయిలవడంతో జట్టుకు భారీ ఓటమి తప్పలేదు. ఇప్పుడు  టోర్నీలో ఇండియా ముందుకు వెళ్లాలంటే టాప్‌‌–3 బ్యాటర్లు మునుపటి మాదిరిగా దంచికొట్టాల్సిన అవసరం ఉంది. ఇంగ్లండ్‌‌ కెప్టెన్ హ్యారీ బ్రూక్‌‌ మాదిరిగా పిచ్‌‌ స్వభావాన్ని అర్థం చేసుకొని ఆడితే మనో ళ్లు కూడా మళ్లీ బ్యాట్లు ఝుళిపించొచ్చు. ఇక ఇండియా టాపార్డర్‌‌లో లెఫ్టాండ్ బ్యాటర్ల ఆధిపత్యం ఎక్కువగా ఉండటంతో, ప్రత్యర్థి జట్లు ఆఫ్‌‌ స్పిన్నర్లతో కట్టడి చేస్తున్నాయి. దీనిని అధిగమించేందుకు సంజూ శాంసన్‌‌ను తుది జట్టులోకి తీసుకునే ఆప్షన్‌‌ ఉన్నా.. అతను కూడా అంతగా ఫామ్‌‌లో లేకపోవడం మేనేజ్‌‌మెంట్‌‌కు తలనొప్పిగా మారింది.

ఈ నేపథ్యంలో కెప్టెన్ సూర్యను మూడో నంబర్‌‌‌‌లో దించి.. తిలక్‌‌ను నాలుగో నంబర్‌‌‌‌లో ఆడిస్తే టాపార్డర్‌‌‌‌లో లెఫ్ట్‌‌–రైట్‌‌ హ్యాండ్ కాంబినేషన్‌‌ను ట్రై చేయొచ్చు. ఇక, ఆల్‌‌రౌండర్లలో శివమ్ దూబే బ్యాట్‌‌, బాల్‌‌తో సత్తా చాటుతున్నా.. సీనియర్ హార్దిక్ పాండ్యా నుంచి జట్టు మరింత మెరుగైన ఆటను ఆశిస్తోంది. ఫ్యామిలీ  ఎమర్జెన్సీ కారణంగా ఇంటికి వెళ్లి తిరిగి జట్టులో చేరిన ఫినిషర్‌‌‌‌ రింకూ సింగ్‌‌ ఈ మ్యాచ్‌‌కు అందుబాటులో ఉండనున్నాడు.  పేస్ లీడర్ బుమ్రా సూపర్‌‌‌‌ ఫామ్‌‌లో ఉన్నా.. బౌలింగ్‌‌లో ఇండియా ఇంకా మెరుగవ్వాలి. సఫారీలపై ఫెయిలైన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్‌‌లో సత్తా చాటాలని చూస్తున్నాడు.  ఇక గత మ్యాచ్‌‌లో చాన్స్ రాని అక్షర్ పటేల్.. సుందర్‌‌‌‌ స్థానంలో తిరిగి తుది జట్టులోకి రావడం ఖాయమే. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌‌ను కూడా ఆడించాలని అనుకుంటే రింకూ సింగ్‌‌ను పక్కనబెట్టే చాన్సుంది. 

రజా సేన బలంగానే...

ఈ వరల్డ్‌‌ కప్‌‌లో జింబాబ్వే ఇప్పటికే ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి జట్లను ఓడించి  జెయింట్ కిల్లర్‌‌గా పేరు తెచ్చుకుంది. గత మ్యాచ్‌‌లో విండీస్ చేతిలో చిత్తయినా ఆ టీమ్‌‌ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. వరల్డ్ నంబర్ వన్ ఆల్‌‌రౌండర్   సికందర్ రజా నాయకత్వంలో ఆ జట్టు అద్భుతమైన పోరాట పటిమను చూపెడుతోంది. ముజరబానీ, నగరావ, ఎవాన్స్  వంటి పేసర్లు ఇండియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.  కెప్టెన్ రజా తన ఆఫ్ స్పిన్‌‌తో ఇండియా టాపార్డర్‌‌లోని  లెఫ్టార్మ్ బ్యాటర్లకు సవాల్ విసరగలడు. బ్యాటింగ్‌‌లో157 స్ట్రయిక్ రేట్‌‌తో ఆడుతున్న మరుమణి పవర్ ప్లేలో తన రివర్స్ స్వీప్‌‌తో ప్రత్యర్థి బౌలర్ల లయను దెబ్బతీస్తున్నాడు. కాబట్టి సూర్యకుమార్ సేన ఏ చిన్న తప్పిదానికి కూడా చోటివ్వకుండా అన్ని విభాగాల్లో మెప్పించాల్సిన అవసరం ఉంది. 

పిచ్‌‌/వాతావరణం

స్పిన్నర్లకు అడ్డాగా పేరున్న చేపాక్ స్టేడియం, ఈసారి బ్యాటర్లకు అనుకూలంగా మారింది. 2025 ఐపీఎల్ తర్వాత ఔట్ ఫీల్డ్ మార్చడంతో బాల్‌‌ బ్యాట్‌‌పై నేరుగా వస్తోంది. ఈ వికెట్‌‌పై ఫాస్ట్ బౌలర్లు వికెట్లు తీయడానికి, రన్స్‌‌ నియంత్రించడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. రెడ్‌‌, బ్లాక్ సాయిల్ మిక్స్‌‌ పిచ్ కావడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. గురువారం వర్ష సూచన లేదు. రాత్రిపూట వాతావరణం కాస్త  వేడిగా  ఉండనుంది.

తుది జట్లు (అంచనా)

ఇండియా:  అభిషేక్,  శాంసన్/తిలక్, ఇషాన్ (కీపర్), సూర్యకుమార్ (కెప్టెన్),  శివమ్‌‌ దూబే,  హార్డిక్ పాండ్యా,  రింకూ సింగ్/కుల్దీప్‌‌,  అక్షర్,  అర్ష్‌‌దీప్,  చక్రవర్తి, బుమ్రా.
జింబాబ్వే: మరుమణి,  బెనెట్,  డియోన్ మైయర్స్, ర్యాన్ బర్ల్,  సికందర్ రజా,  మున్యోంగా, ముసెకివా,  ఎవాన్స్,  గ్రేమ్ క్రీమర్,  ముజరబానీ,  ఎన్‌గరావ.